నేడు భారతదేశ చరిత్రలో నిలిచిపోయే రోజు అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తెలిపారు. గతంలో చంద్రబాబుతో పాటు, ఆయన సతీమణి పై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కౌరవ సభలో ఉండలేనని, గౌరవ సభలో సీఎంగా వస్తానని ప్రతిన బూని మరీ చంద్రబాబు ఆరోజు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారని చెప్పారు. ఇప్పుడు చెప్పిన విధంగా మహారాజులాగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెట్టారని కొనియాడారు. ఈ ఘట్టం దేశ రాజకీయాల్లో ఒక చరిత్రగా నిలిచిపోతుందని అభివర్ణించారు. వైసీపీ నేత కొడాలి నాని మళ్లీ ఏదేదో మాట్లాడుతున్నారని.. తమ అధిష్ఠానం దాడులు వద్దని చెప్పిందని.. దాంతో తాము సంయమనం పాటిస్తున్నామని అన్నారు. తమ సైలెంట్‌ను చులకనగా చూడవద్దని హెచ్చరించారు. ఇప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు గురించి అభ్యతరకరంగా మాట్లాడుతావా కొడాలి నాని ఖబార్దార్ అని వార్నింగ్ ఇచ్చారు.