ఏపీ మంత్రి నారా లోకేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. చంద్రబాబు మంత్రివర్గంలో మానవవనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా లోకేష్ నియమితులయ్యారు. అయితే ఛాంబర్‌లో కొన్ని పనులు మిగిలి ఉన్న కారణంగా ఇన్నిరోజులు ఇంటి నుంచే విధులు నిర్వహించిన నారా లోకేష్.. సోమవారం సచివాలయంలో నిరాడంబరంగా బాధ్యతలు స్వీకరించారు. పండితుల వేద మంత్రాల నడుమ సచివాలయంలోకి అడుగుపెట్టిన లోకేష్.. నాలుగో బ్లాక్‌లోని 208 ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మెగా డీఎస్సీ విధివిధానాలకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ నేతలు లోకేష్‌ను కలిసి అభినందనలు తెలిపారు.
మరోవైపు నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా.. ఆయన సతీమణి నారా బ్రాహ్మణి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన నారా బ్రాహ్మణి.. భావితరం భాగ్యరేఖలు మార్చగలవనే నమ్మకం నాకుందంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు.
"అంతా పల్లెల్లో నుంచి అమెరికా వెళితే, అక్కడ చదివి పల్లె గడపల వద్దకు వచ్చి, సిమెంట్ రోడ్లతో, ఎల్ఇడి వెలుగులతో వాటి రూపురేఖలు మార్చేశావ్. పనిలో పడి విమర్శలను పట్టించుకోకుండా అవార్డుల పంట పండించావు. నీ వ్యక్తిత్వహననం చేసిన వారు అవాక్కయ్యేలా వాళ్ళకు నువ్వేంటో తెలియజేశావు. సవాళ్లతో కూడిన శాఖలను సాహసంతో తీసుకొన్నావు. నీ సమర్ధతతో నేటితరం, భావితరం భాగ్యరేఖలు నువ్వు మార్చగలవనే నమ్మకం నాకుంది. కుటుంబపరంగా ఎల్లవేళలా మీకు మా సహకారం ఉంటుంది. కంగ్రాట్స్ డియర్ @naralokesh" అని నారా బ్రాహ్మణి ట్వీట్ చేశారు.
అయితే నారా బ్రాహ్మణి ట్వీట్‌కు ఓ టీడీపీ అభిమాని ఫన్నీ రియాక్షన్ ఇచ్చారు. నారా బ్రాహ్మణి.. లోకేష్‌ను డియర్ అని, నువ్వూ అని ఏకవచనంతో సంభోధిస్తూ ట్వీట్ చేయడంతో.. ఆయన ఫన్నీ రిప్లై ఇచ్చారు. ఎంతైనా మన నారా లోకేష్ గారు మంత్రి మేడమ్.. మీరు అని అనండి అంటూ ఫన్నీ ఎమోజీ ఉంచారు. అయితే దీనికి కూడా ఫన్నీ రియాక్షన్లు వస్తున్నాయి. మంత్రి కన్నా అమెకు భర్త ప్లస్ బావ అంటూ మరో నెటిజన్ ఫన్నీ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం నారా బ్రాహ్మణి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
నారా బ్రాహ్మణి ట్వీట్‌కు అభిమాని ఫన్నీ రిప్లై
మరోవైపు 2014లోనూ నారా లోకేష్ మంత్రిగా పనిచేశారు. అయితే అప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికైన లోకేష్.. మంత్రివర్గంలో చేరారు. అయితే ఈసారి మంగళగిరి నుంచి రికార్డు విక్టరీ కొట్టి తొలిసారిగా ఎమ్మెల్యే ఎన్నికై.. మంత్రి పదవిని అలంకరించారు. అయితే 2019లో మంగళగిరిలో ఓడిపోయినప్పుడు లోకేష్ మీద విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని నారా బ్రాహ్మణి.. లోకేష్ కృషిని, ఐదేళ్లలో పడిన కష్టాన్ని కొనియాడుతూ ట్వీట్ చేశారు.