వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల పర్యటన ముగిసింది. మూడు రోజులపాటు సొంత నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించడంతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారాయన. సోమవారం మధ్యాహ్నాం తన పర్యటన ముగించుకుని సతీసమేతంగా బెంగళూరుకు వెళ్లారు. సోమవారం పులివెందులలో వైయస్ జగన్.. వైయస్ఆర్ జిల్లాతో పాటు కర్నూలు, అనంతపురం, చిత్తూరు.. చుట్టు పక్కల జిల్లాల నుంచి పార్టీ శ్రేణులను కలిశారు. పార్టీ నాయకుల్ని, అభిమానుల్ని కలవడంతో పాటు వాళ్ల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. పార్టీ ఓటమిని తల్చుకుని బాధపడొద్దని, ధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. అలాగే అనారోగ్యంతో మృతి చెందిన వైయస్ఆర్ సీపీ నాయకుడు సంకిరెడ్డి మృతదేహానికి వైయస్ జగన్ దంపతులు నివాళులర్పించారు. సంకిరెడ్డి కుటుంబాన్ని వైయస్ జగన్ ఓదార్చారు. తన మూడు రోజుల పులివెందుల పర్యటనలో పార్టీ నాయకులతో ఎన్నికల ఓటమిపై సమీక్ష జరిపిన ఆయన.. అధైర్య పడొద్దని, రాబోయే రోజులు పార్టీవేనని, ఉత్సాహంగా పని చేయాలని సూచించారు. మరోవైపు సొంత నియోజకవర్గంలో వైఎస్ జగన్‌కు అడుగడుగునా సాదర స్వాగతం లభించింది. ఆయన్ని కలిసేందుకు కార్యకర్తలు, ప్రజలు పులివెందుల క్యాంప్ కార్యాలయానికి క్యూ కట్టారు. ఎన్నికల ఫలితంతో సంబంధం లేకుండా మీ వెంటే ఉన్నామంటూ నియోజకవర్గం.. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజానీకం నినాదాలతో చాటి చెప్పింది.