తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు ఉండటంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు. భారీ సంఖ్యలో శ్రీనివాసుని దర్శనానికి తరలివెళ్లారు. దీంతో శ్రీవారి దర్శనానికి గంటల కొద్ది సమయం పడుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి టీబీసీ వరకు భక్తుల క్యూలైన్ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది.
ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. శనివారం తిరుమల శ్రీవారిని 80,404 మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అందులో 35,825 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నట్లు వెల్లడించారు. హుండీ ఆదాయం రూ.3.83 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.