పిఠాపురాన్ని దేశంలో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది తన ఆకాంక్ష అంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తనను భారీ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్‌లను అందజేశారు. డబ్బులు సంపాదించాలనో.. కొత్తగా పేరు రావాలనో తనకు లేదన్నారు. గెలిచినందుకు ఆనందం లేదని.. పనిచేసి ప్రశంసలు అందుకుంటేనే ఆనందంగా ఉంటుందన్నారు.
ప్రతి రెండు వారాలకోసారి పిఠాపురం వస్తానన్నారు పవన్ కళ్యాణ్. నియోజకవర్గంలోని సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరించడంపై ఫోకస్ పెడతానన్నారు. గోదావరి జిల్లాల్లో 80 శాతం చెరువులున్నా తాగడానికి నీళ్లు లేవని.. జల్ జీవన్ మిషన్‌కు కేంద్రం నిధులు ఇస్తుందని.. కానీ గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదన్నారు. విజయవాడలోని తన క్యాంపు ఆఫీస్‌లో మరమ్మతుల గురించి తనను అధికారులు అడిగారని.. తాను ఏమీ చేయొద్దని చెప్పానన్నారు. అంతేకాదు క్యాంప్ ఆఫీస్‌లోకి తానే కొత్త ఫర్నీచర్ తెచ్చుకుంటానని పవన్ చెప్పారు.
సచివాలయం సిబ్బంది వచ్చి వేతనాలకు సంబంధించిన పత్రాలపై సంతకాలు పెట్టమని తనను అడిగారని.. కానీ తనకు మనస్కరించలేదన్నారు. తాను జీతం తీసుకుని పనిచేద్దామనుకున్నానని.. కానీ తాను బాధ్యతలు తీసుకున్న పంచాయతీరాజ్ శాఖలో నిధుల్లేవన్నారు. తాను బాధ్యతలు నిర్వర్తిస్తున్న శాఖ అప్పుల్లో ఉన్నప్పుడు తాను జీతం తీసుకోవడం చాలా తప్పు అనిపించిందని.. అందుకే జీతం వదిలేస్తున్నట్లు వారితో చెప్పానన్నారు. అంతేకాదు ఎన్ని వేలకోట్ల రూపాయల అప్పులు ఉన్నాయో తెలియడం లేదని.. ఒక్కో శాకలో తవ్వే కొద్దీ లోపలికి వెళ్తూనే ఉందన్నారు డిప్యూటీ సీఎం పవన్. వీటిని సరిచేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.
ప్రజల్లో తనకు సుస్థిర స్థానం కావాలని.. అన్ని పనులూ చిటికెలో కావని గమనించాలని.. కానీ అయ్యేలా పని చేస్తామన్నారు పవన్ కళ్యాణ్. తక్కువ చెప్పి ఎక్కువ పనిచేయాలనుకుంటున్నానని.. తనవైపు నుంచి ఎలాంటి అవినీతి జరగదన్నారు. పార్టీకి ఓటు వేయకపోయినా అర్హత ఉంటే పింఛన్లు కచ్చితంగా వస్తాయని.. అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లు పెంచి ఇచ్చామే తప్ప తగ్గించలేదన్నారు. తాము అద్భుతాలు చేస్తామని చెప్పట్లేదని.. ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుందన్నారు. రాష్ట్రానికి సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలని అభిప్రాయపడ్డారు.
తాము ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటామన్నారు పవన్. తన మంత్రిత్వ శాఖలపై అధ్యయనం చేస్తున్నానని.. బాధ్యతలు చేపట్టిన వెంటనే నేరుగా పనిలోకి వెళ్లాలనుకున్నానన్నారు. పంచాయతీరాజ్ శాఖ నిధులను గత ప్రభుత్వం అడ్డగోలుగా మళ్లించిందన్నారు. రుషికొండలో విలాసవంతమైన భవనం అవసరమా? అని ప్రశ్నించిన పవన్.. రుషికొండలో కట్టిన డబ్బుతో ఎంతో అభివృద్ధి చేయొచ్చన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సమయంలో డాక్టర్ల సేవలు మరువలేనివి.. కరోనా బారినపడి 1,600 మంది వైద్యులు మరణించారన్నారు. దురదృష్టవశాత్తు వైద్యులపై ఈమధ్య దాడులు పెరిగాయని.. రోగుల పట్ల వైద్యులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. వైద్యుల పట్ల రోగులు విశ్వాసం కలిగి ఉండాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.