ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగాన్ని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఏపీలో పారిశ్రామికవేత్తలు ఆందోళనలో ఉన్నారని, వైసీపీ పాలనలో వారిని పట్టించుకున్న నాథుడే లేడని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ మేరకు గన్నవరం పారిశ్రామికవాడను మంత్రి టీజీ భరత్, స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.." ఒక పరిశ్రమ రావాలంటే నీరు, రోడ్లు, డ్రెయిన్, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలి. ఆ విషయంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మల్లవల్లి పారిశ్రామికవాడలో నీటి సమస్య ఉంది. దాన్ని త్వరలోనే పరిష్కరిస్తాం. గత వైసీపీ పాలనలో అశోక్ లేలాండ్ సంస్థ రాష్ట్రం విడిచి పారిపోయే పరిస్థితి కల్పించారు. టీడీపీ ప్రభుత్వంలో దాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వగానే అశోక్ లేలాండ్ కంపెనీ.. మల్లవల్లిలో నడిపేందుకు ఆసక్తి చూపుతోంది. వైసీపీ పాలనలో పరిశ్రమలకు భూమి కేటాయింపు ధరలు విపరీతంగా ఉన్నాయి. చంద్రబాబు సర్కార్‌లో ఈ విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. మల్లవల్లి ఇండస్ట్రీలో ఉన్న చిన్నచిన్న సమస్యలు పరిష్కరించి, దాన్ని ఒక బ్రాండ్‌గా మారుస్తా. ఏపీలో పరిశ్రమలు పెట్టేందుకు వచ్చే సంస్థలకు చంద్రబాబు సర్కార్ అండగా ఉంటుంది" అని మంత్రి చెప్పారు.