ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటైన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మరో హామీని నెరవేర్చింది. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తామని ప్రకటించిన చంద్రబాబు నాయుడు.. ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట నిలబెట్టుకున్నారు. ఉచిత ఇసుక విధానం తీసుకువచ్చారు. ఏపీవ్యాప్తంగా సోమవారం (జులై8) నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఉచిత ఇసుక విధానంపై నెట్టింట కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఉచితంగా ఇసుక అని చెప్పి టన్ను ఇసుక సుమారుగా రూ.1300లకు విక్రయిస్తున్నారంటూ కొన్ని ఫ్లెక్సీలు, పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నర్సీపట్నం ఇసుక డిపో వద్ద టన్ను ఇసుక రేటు రూ.1,225, విశాఖ అగనంపూడి వద్ద టన్ను ఇసుక రూ.1,394 అని ఉన్న ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో ఉచిత ఇసుక అని చెప్పి ఇంత రేటా అని నెటిజనం కామెంట్లు పెడుతున్నారు.
అయితే దీనికి అధికార వర్గాలు వేరే కారణాలు చెప్తున్నాయి. వేరే ప్రాంతాల నుంచి ఇసుక తీసుకురావాల్సి ఉన్నందున ఇసుక ఈ రేటు ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఉచిత ఇసుక విధానంలో నామమాత్రపు ధరలకు ఇసుకను అందించనున్నారు. ఇసుక కావాల్సిన వారు స్టాక్ పాయింట్ల వద్ద ఇసుల లోడింగ్, రవాణా ఛార్జీలను చెల్లించి ఇసుకను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇతర ప్రాంతాల నుంచి ఇసుకను తీసుకువచ్చిన రవాణా ఛార్జీలు కూడా కలిసి ఈ రేటును ఫిక్స్ చేసినట్లు తెలిసింది.
మరోవైపు ఉచిత ఇసుకపై విధివిధానాలు ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం జీవో విడుదల చేసింది. నూతన ఇసుక పాలసీని తయారుచేసే వరకూ ఈ మార్గదర్శకాలను అనుసరించనున్నారు. ఇసుక క్వారీలలో తవ్వకాల కోసం జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీల్లో జిల్లా ఎస్పీ, జేసీ సహా వివిధశాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. ఇక జిల్లాల్లో ఉండే స్టాక్ పాయింట్లు ఈ కమిటీల ఆధ్వర్యంలో నడుస్తాయి. అలాగే ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీలను సైతం ఇవే కమిటీలు నిర్ధారిస్తాయి. ఇక ఈ ఛార్జీలను సైతం డిజిటల్ విధానంలోనే జరపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇసుక విక్రయాల్లో పారదర్శకత కోసం లోడింగ్, ట్రాన్స్ పోర్ట్ ఛార్జీల చెల్లింపులను డిజిటల్ విధానాల్లోనే చేపట్టాలని విధివిధానాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఇసుకను మరోచోట విక్రయించినా.. ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. భవనాల నిర్మాణాల కోసం తప్ప మరే ఇతర పనులకు ఇసుకను వినియోగించకూడదని స్పష్టం చేసింది.