కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో ఏపీలో రెండు రైళ్లను పునరుద్ధరించారు. రైలు ప్రయాణికుల సమస్య గురించి తెలియగానే వెంటనేస్పందించిన ఆయన.. ఒక్క లేఖతో పరిష్కరించారు. గూడూరు-విజయవాడ, విజయవాడ-గూడూరు మీదుగా ప్రయాణించే రెండు రైళ్ల రాకపోకల్ని రద్దు చేశారు. అయితే ఈ రెండు రైళ్లకు సంబంధించిన అంశాన్ని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. రైల్వే అధికారులతో మాట్లాడారు. ఈ రెండు రైళ్లు వెంటనే అందుబాటులోకి వచ్చేలా చూడాలని కోరారు.
విజయవాడ పరిధిలో నూతన రైల్వే లైను నిర్మాణం, రైల్వే సిగ్నలింగ్ ఆధునికీకరణ పనులతో రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది. మొత్తం 25 ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. గూడూరు-విజయవాడ, విజయవాడ-గూడూరు మధ్య నడిచే రెండు రైళ్లు కూడా తాత్కాలికంగా రద్దయ్యాయి. ఈ రైళ్లలో ఎక్కువమంది ఒంగోలు-బాపట్ల-తెనాలి మీదుగా విజయవాడ వరకు రోజూ ప్రయాణించే కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇబ్బందిపడుతున్నారు.
ప్రయాణికుల సమస్య గురించి తెలియడంతో.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. ఈ సమస్యపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్‌కులేఖ రాశారు. వెంటనే స్పందించిన జీఎం అరుణ్‌కుమార్.. విజయవాడ-గూడూరు, గూడూరు-విజయవాడ రైళ్లు (12734, 12733) రైళ్లను పునరుద్ధరించారు. సోమవారం సాయంత్రానికి ఆదేశాలు జారీ చేయగా.. ప్రయాణికుల సమస్యలపై స్పందించిన కేంద్ర సహాయమంత్రి డాక్టర్ పెమ్మసానికి ప్రయాణికులు ధన్యవాదాలు తెలిపారు.
సికింద్రాబాద్-ముజఫర్‌పూర్ ప్రత్యేక రైలు
రైల్వే అధికారులు నేటి నుంచి సెప్టెంబర్ 26 వరకు ముజఫర్‌పూర్ – సికింద్రాబాద్, సికింద్రాబాద్ – ముజఫర్‌పూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు. ముజఫర్‌పూర్ – సికింద్రాబాద్ (05293) రైలు నేటి నుంచి (ప్రతి మంగళవారం) ఉదయం 10.45 గంటలకు ప్రారంభమై.. మరుసటిరోజు రాత్రి 11.50 గంటలకు సికింద్రాబాద్ వస్తుంది. సికింద్రాబాద్ – ముజఫర్‌పూర్ (05294) రైలు ఈ నెల 18 నుంచి సెప్టెంబర్ 26 వరకు ప్రతి గురువారం ఉదయం 3.55 బయలుదేరి.. శుక్రవారం మధ్యాహ్నం 4.30 ముజఫర్‌పూర్ చేరుకుంటుంది. తెలంగాణలోని సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, రామగుండం, పెద్దపల్లి, కాజీపేట స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ స్పెషల్ రైల్‌లో ఫస్ట్ ఏసీ, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, ఎకానమీ క్లాస్ అందుబాటులో ఉన్నాయి.