ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై కోడి కత్తి దాడి కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావుకు సుప్రీం కోర్టుల ఊరట లభించింది. శ్రీనుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు కోరుతూ ఎన్ఐఏ మే 6న ఎస్‌ఎల్‌పీ దాఖలు చేయగా.. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసులో శ్రీనుకు ఏపీ హైకోర్టు గత ఫిబ్రవరి 8న ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయడానికి నిరాకరించింది. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు 11వ పేరాలో కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేశారని.. ఇవి కేసు దర్యాప్తుపై ప్రభావం చూపకుండా ఉత్తర్వులు ఇవ్వాలని అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్ రిక్వెస్ట్ చేయగా.. సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోమంటూనే.. ఈ కేసు ట్రయల్‌పై దాని ప్రభావం ఉండకూడదని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఏపీ హైకోర్టు శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేయగా.. 24 పేజీల తీర్పులోని 11వ పేరాలో హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. '2018 అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో జగన్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై అప్పటి సీఐఎస్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దినేష్ ఫిర్యాదుతో విశాఖపట్నం పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పిటిషనర్ తరఫు లాయర్ కీలక వాదనలు వినిపించారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోని వీఐపీ లాంజ్‌లో శ్రీనివాస్ జగన్‌ని సెల్ఫీ అడిగారని.. అప్పుడు శ్రీను జగన్ ఎడమ వైపున నిలబడి, చిన్న కత్తితో ఎడమ భుజం కింద దాడి చేయడంతో గాయమైంది' అని ప్రస్తావించారు.
'ఈ కేసులో జగన్‌ను చంపడానికి శ్రీను కత్తిని మెడపై పెట్టినట్లు ఎఫ్ఐఆర్‌లో ఎక్కడా ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ఎఫ్ఐఆర్ అంటే నేరానికి సంబంధించి వాస్తవాలు ఉండే ఎన్‌సైక్లోపీడియా కాదు. అలాగే జగన్‌ను చంపేలా దాడి చేసి ఉంటే ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయకుండా వదిలేసేంత చిన్న విషయం కూడా కాదు. జగన్‌ను చంపేయాలన్న కసితో శ్రీను దాడి చేసినట్లు కనిపించలేదని.. ఈ కేసులో ప్రధాన సాక్షి ఇచ్చిన వాంగ్మూలం చెబుతోంది. ఈ కేసులో ఇతర సాక్షుల వాంగ్మూలాల్లోనూ ఇదే అంశాన్ని, కోణాన్ని ప్రస్తావించారు' అన్నారు.
'అలాగే ఈ కేసులో నమోదు చేసిన వాంగ్మూలంలో కూడా జగన్‌ను చంపాలనే కోణం కనిపించలేదు. జగన్ ఎడమ చేయి పైభాగంలో చిన్న గాయమే అయ్యింది. శ్రీను నుంచి స్వాధీనం చేసుకున్న కత్తి 2.5 అంగుళాలు ఉంది.. ఈ దాడి వల్ల తీవ్ రగాయం, మరణం సంభవించలేదు. శ్రీను జగన్‌ను తీవ్రంగా గాయపరచడానికో, చంపడానికో దాడి చేసినట్లుగా లేదు. అంతేకాదు పరికరాన్నో, వస్తువునో, ఆయుధాన్నో ఉపయోగించి హింసాత్మక చర్యకు పాల్పడినంత మాత్రాన అది సెక్షన్ 3/ఏ కింద పేర్కొన్న నేరాల కిందికి రాదు. ఆ హింస కారణంగా వ్యక్తికి తీవ్రగాయం, మరణిస్తే దాన్ని నేరంగా భావించడానికి వీల్లేదు. ఈ కేసులో అలాంటిదేమీ లేదు' అని హైకోర్టు తీర్పు కాపీలోని 11వ పేరాలో పేర్కొంది. ఈ అంశాన్ని ప్రస్తావించిన అదనపు సొలిసిటర్ జనరల్.. ఈ వ్యాఖ్యలు కేసు ట్రయల్‌పై ప్రభావం చూపకుండా నిలువరించాలని ఎన్‌ఐఏ తరఫున కోరగా.. అంగీకారం తెలిపారు.