ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కొనసాగుతున్నాయి.. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. గత రెండు రోజులుగా ముసురు వాతావరణం కనిపిస్తోంది. ఈ నెల 19న పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు.. బుధవారం కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. గురు, శుక్రవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడాయని.. సముద్రం అలజడిగా ఉంటుందని.. అందుకే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు.
అల్పపీడనం ప్రభావంతో ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందంటున్నారు.
మరోవైపు సోమవారం విజయనగరం,విశాఖపట్నం, అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. విజయవాడలో రోజంతా వర్షం పడటంతో రోడ్లపై వరదనీరు నిలిచిపోయింది.. కొన్ని కాలనీలు జలమయం అయ్యాయి. అయితే అత్యధికంగా కృష్ణా జిల్లా కృత్తివెన్నులో 65.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల విషయానికి వస్తే.. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో 43.8 మిల్లీ మీటర్లు, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో 27.8, నెల్లూరు జిల్లా కందుకూరులో 23, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 22.4, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 21.8, నంద్యాల జిల్లా పీఏ పల్లెలో 20.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.