మహారాష్ట్ర ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు సంబంధించి రోజుకో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇటీవలె ఆమె మీడియా ముందుకు వచ్చి తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించగా.. తాజాగా ఆమెపై కేంద్రం కఠిన చర్యలు చేపట్టింది. ట్రైనింగ్‌ను ఆపేయాలని పూజా ఖేద్కర్‌కు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఆమెను తిరిగి ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కు రావాలని ఆదేశించింది. పూజా ఖేద్కర్.. తప్పుడు ధృవపత్రాలు సమర్పించి ఐఏఎస్ ఉద్యోగం, ఎంబీబీఎస్ అడ్మిషన్ పొందినట్లు రోజుకో ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. రైతులను బెదిరించిన కేసులో ఆమె తల్లిదండ్రులు ఇప్పటికే పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
ట్రైనీ ఐఏఎస్ అధికారిణి అయిన పూజా ఖేద్కర్.. ప్రొబేషనరీ పీరియడ్‌లోనే ఐఏఎస్‌కు కల్పించే హోదా, అధికారాలు, సౌకర్యాలు కల్పించాలని.. కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చిన విషయం బయటికి రావడంతో ఆమె బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. ఆమె తన సొంత ఆడీ కారుకు బీకన్ లైట్లు బిగించుకోవడం.. అడిషనల్ కలెక్టర్ ఛాంబర్‌ను స్వాధీనం చేసుకోవడం వంటి అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో ఆమె ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. ఈ క్రమంలోనే ఆమెపై తీవ్ర విమర్శలు రాగా.. పూజా ఖేద్కర్ చేసిన ఒక్కొక్క అక్రమం బయటకు వస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఐఏఎస్ పోస్టింగ్ సమయంలో యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించడం.. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ధృవపత్రంతో ఉద్యోగం సాధించినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆమె వార్తల్లో నిలిచారు. మహారాష్ట్రలోని జిల్లా శిక్షణా కార్యక్రమం నుంచి పూజా ఖేడ్కర్‌ని రిలీవ్ చేస్తున్నట్లు జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం కూడా ఒక ప్రకటనలో తెలిపింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఆమె సమర్పించిన పలు ధ్రువీకరణ పత్రాల్లో పూజా ఖేద్కర్‌కు దృష్టి లోపానికి సంబంధించిన అంశంపై దర్యాప్తు జరుగుతోంది. పూజా ఖేద్కర్‌పై మొదట ఆరోపణలు వెల్లువెత్తడంతో పుణె నుంచి వాసింకు బదిలీ చేయగా.. ఇప్పుడు ఆమె ట్రైనింగ్ రద్దు చేసి అకాడమీకి రావాలని ఆదేశించడం గమనార్హం.