ఢిల్లీలోని ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లోకి వరదనీరు పోటెత్తి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు చనిపోయిన ఘటన కేసును సీరియస్‌గా తీసుకున్న ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అయితే సెల్లార్‌లో భారీగా వరద చేరి బయటికి రాక అందులోనే మృత్యువాత పడిన ఘటనతో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు, ఆందోళనలు వ్యక్తం అవుతున్న వేళ.. తాజాగా భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. భారీగా వరద వచ్చిన సమయంలో ఆ బిల్డింగ్ ముందు నుంచి వేగంగా కారును నడిపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే వరదలు పోటెత్తిన సమయంలో నిర్లక్ష్యంగా వాహనం నడిపి పరోక్షంగా.. ఆ ముగ్గురు విద్యార్థుల మృతికి కారణం అయ్యాడని.. ఓ కారు డ్రైవర్‌ను సోమవారం సాయంత్రం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ అభ్యర్థుల మరణం వెనుక ఆ డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కోణం ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి తాజాగా 2 వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో కారు డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఉందని పోలీసులు గుర్తించారు. శనివారం రాత్రి భారీగా వర్షం పడుతున్న సమయంలో.. ఆ కోచింగ్ సెంటర్ ముందు నుంచి ఆ డ్రైవర్ వేగంగా కారును డ్రైవ్ చేయడంతో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగి.. మరింత వేగంగా ఆ బిల్డింగ్ గేట్ వైపు దూసుకుపోవడంతో ఆ గేట్ విరిగిందని పోలీసులు పేర్కొన్నారు.
గేట్ విరిగిపోవడంతో వరద నీరు మరింత వేగంగా సెల్లార్‌లోకి దూసుకువెళ్లిందని అనుమానిస్తున్నారు. అయితే ఆ కారు డ్రైవర్‌ను ఆపేందుకు ఓ స్థానికుడు ప్రయత్నించినా.. ఆపకుండా వేగంగా వెళ్లిపోయాడని పోలీసుల విచారణలో తేలింది. ఆ వీడియో ప్రారంభంలో కోచింగ్ ఇనిస్టిట్యూట్ గేట్ బాగానే ఉన్నా.. కారు వేగంగా వెళ్లిన తర్వాత ఆ గేట్ విరిగి కిందపడినట్లు కనిపించింది. దీంతో ఈ కేసులో ఆ డ్రైవర్‌ను కూడా నిందితుడిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
శనివారం సాయంత్రం ఢిల్లీలో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచేశాయి. ఈ క్రమంలో ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని రవూస్ సివిల్స్ కోచింగ్ సెంటర్‌లోని సెల్లార్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆ బిల్డింగ్‌లోని సెల్లార్‌లో చిక్కుకున్న విద్యార్థులు బయటికి రావడం కష్టమైంది. సెల్లార్‌లోని లైబ్రరీలో చదువుకుంటున్న 33 మంది విద్యార్థులు వరదలో చిక్కుకున్నారు. అయితే వేగంగా నీటి వరద పెరగ్గా.. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి.. 30 మంది అభ్యర్థులను సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. మిగిలిన ముగ్గురు అప్పటికే నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు ఉన్నాడు.