ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో మఆగస్టు 30న పోలింగ్, మూడు జిల్లాల్లో కోడ్ అమల్లోకి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 31, 2024, 10:12 PM

ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైఎస్సార్‌సీపీ తరఫున వంశీకృష్ణ శ్రీనివాస్‌ గెలిచారు. అయితే ఆయన జనసేన పార్టీలో చేరగా.. అనంతరం అనర్హత వేటు వేయడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. ఆ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు షెడ్యూల్ వచ్చిందని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ తెలిపారు.


 ఆగస్టు 6న ఉపఎన్నిక నోటిఫికేషన్‌ విడుదలవుతుంది.. అదేరోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఆగస్టు 13 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంది. 14న పరిశీలన.. ఆగస్టు 16న ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. ఆగస్టు 30న ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు ఉపఎన్నిక జరగనుంది. సెప్టెంబరు 3వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.. సెప్టెంబరు 6వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో ఈ ఎన్నిక జరుగుతుంది. అంటే విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా ప్రజాపరిషత్‌, మండల ప్రజాపరిషత్‌ సభ్యులు కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు.


ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో గెలిచిన వారి పదవీ కాలం 2027 డిసెంబరు ఒకటో తేదీ వరకు ఉంటుంది. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ మంగళవారం విడుదల చేయడంతో.. మూడు జిల్లాలలో (విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు) ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు. కోడ్‌ ముగిసేంత వరకూ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు ఉండవని.. అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ఉండవని తెలిపారు.


మూడేళ్ల క్రితం విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికల్లో.. ఉమ్మడి జిల్లాలో మెజారిటీ స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలిచింది. స్థానిక సంస్థల కోటాలో 2021 డిసెంబరులో రెండు ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలు జరగ్గా.. వంశీకృష్ణ శ్రీనివాస్‌, వరుదు కళ్యాణి ఎమ్మెల్సీలుగా గెలిచారు. అయితే వంశీకృష్ణ గతేడాది నవంబరులో వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. పార్టీ ఫిరాయింపు పేరుతో వంశీకృష్ణ శ్రీనివాస్‌ను ఎమ్మెల్సీ పదవికి అనర్హుడిగా శాసన మండలి ఛైర్మన్ ప్రకటించారు. ఆ స్థానానికే ఇప్పుడు ఎన్నిక జరగతోంది. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వంశీకృష్ణ శ్రీనివాస్‌ విశాఖపట్నం దక్షిణం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎమ్మెల్సీ పదవి గెలుపు కోసం టీడీపీ, వైఎస్సార్‌సీపీలు పోటీపడనున్నాయి.. దీంతో ఈ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. రెండు పార్టీలు ఎవరిని పోటీ చేయిస్తుంది అనేది చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com