భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. బాలీవుడ్ సినిమా లాపతా లేడీస్‌ను సుప్రీంకోర్టులో ప్రసారం చేశారు. సుప్రీంకోర్టులో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జడ్జిలు, వారి కుటుంబసభ్యులు, ఇతర అధికారులు ప్రత్యేకంగా ప్రదర్శించిన బాలీవుడ్ సినిమా లాపతా లేడీస్‌ను వీక్షించారు. ఈ సినిమాను చూసేందుకు బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్, డైరెక్టర్ కిరణ్ రావ్ కూడా హాజరయ్యారు.
సుప్రీంకోర్టు ఆవిర్భవించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం 4.15 గంటల నుంచి 6.20 గంటల వరకు ఈ లాపతా లేడీస్ సినిమాను ప్రదర్శించారు. సుప్రీంకోర్టులోని అడ్మినిస్ట్రేటివ్ భవనంలోని సి-బ్లాక్‌లో గల ఆడిటోరియంలో లాపతా లేడీస్ సినిమాను ప్రసారం చేశారు. ఈ సినిమా స్క్రీనింగ్‌కు హీరో అమీర్ ఖాన్, డైరెక్టర్ కిరణ్ రావ్ కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు అమీర్ ఖాన్ రానున్న నేపథ్యంలో తొక్కిసలాట తరహా ఘటనలు తాను కోరుకోవడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సరదాగా వ్యాఖ్యలు చేశారు. సామాజిక అంశాలను లేవనెత్తే అమీర్ ఖాన్ తన సొంత బ్యానర్‌పై ఈ లాపతా లేడీస్ సినిమాను తెరకెక్కించారు. దీనికి కిరణ్ రావ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ ఏడాది మార్చిలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలు వచ్చినప్పటికీ.. సినీ ప్రముఖులు, విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు.
2001లో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువ వధువులు రైలు ప్రయాణంలో తప్పిపోయిన ఘటన ఆధారంగా ఈ లాపతా లేడీస్ సినిమాను తెరకెక్కించారు. లింగ సమానత్వాన్ని చాటిచెప్పే ఈ కామెడీ డ్రామా సినిమా.. ఈ ఏడాది విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన సక్సెస్ కాకపోయినా.. ఓటీటీలో మాత్రం ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇక ఈ సినిమా విడుదలకు ముందుగానే గతేడాది సెప్టెంబరు 8 వ తేదీన లాపతా లేడీస్ సినిమాను ప్రతిష్ఠాత్మక టోరంటో ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (టీఐఎఫ్‌ఎఫ్) వేడుకలో ప్రదర్శించారు. ఈ వినోదభరితమైన చిత్రంలో నితాన్షీ గోయల్, ప్రతిభా రంతా, స్పర్శ్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్, రవికిషన్ కీలక పాత్రలు పోషించారు.