భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ.. తర్వాత ఎక్కువసార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా నరేంద్ర మోదీ నిలిచారు. ఈ క్రమంలోనే ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోదీ మరో రికార్డును అందుకోనున్నారు. ఇప్పటివరకు 10 సార్లు ఎర్రకోటపై జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. ఇప్పుడు 11 వ సారి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం ఎర్రకోట వేదికగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ 11 వ సారి ప్రసంగించనున్నారు.
అయితే దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తర్వాత అంతటి ఘనత సాధించిన మూడో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రికార్డు నెలకొల్పనున్నారు. అయితే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా వరుసగా 11 సార్లు ప్రధానిగా జెండా ఎగురవేసి ప్రసంగించగా.. మొత్తంగా ఆమె 16 సార్లు ప్రధానిగా జెండా ఎగురవేశారు. ఇక ఈసారి ఎర్రకోటపై స్వాతంత్య్ర దినోత్సవాలకు దేశవ్యాప్తంగా 18 వేల మందికిపైగా హాజరు కానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సామాన్యులు, పేదలు, మహిళలు, యువత, రైతులను.. ఎర్రకోట వేదికగా జరిగే ఇండిపెండెన్స్ డే వేడుకలకు ప్రత్యేకంగా ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ఆహ్వానితుల జాబితాను కేంద్ర ప్రభుత్వ అధికారులు సిద్ధం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్ 2024లో పాల్గొన్న భారత క్రీడాకారుల బృందాన్ని కూడా ఈ వేడుకలకు ఆహ్వానించాలని కేంద్రం భావిస్తున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.
ఇక ఇప్పటివరకు దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వరుసగా 17 సార్లు ప్రసంగించి.. ఈ రికార్డులో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. కాగా1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు.. ఆ తర్వాత మళ్లీ జనవరి 1980 నుంచి అక్టోబర్ 1984 వరకు ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ 16 సార్లు జాతిని ఉద్దేశించి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేశారు. ఇక ఇందులో ఇందిరాగాంధీ వరుసగా 11 సార్లు ప్రసంగించారు.
ఈసారి గురువారం ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ.. 10 సార్లు స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేసిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ రికార్డును బద్దలు కొట్టనున్నారు. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఎర్రకోట వేదికగా స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేసిన ప్రధాని మోదీ.. స్వచ్ఛ భారత్, జన్ ధన్ ఖాతాల వంటి విప్లవాత్మక పథకాలను ప్రారంభించారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ.. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాల సగటు వ్యవధి 82 నిమిషాలు. కాగా.. ఇది దేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి చేయనంత ఎక్కువ సమయం కావడం గమనార్హం. మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ 71 నిమిషాల సగటుతో రెండో స్థానంలో నిలిచారు. అయితే ఐకే గుజ్రాల్ 1997లో ఇచ్చిన ఏకైక ప్రసంగం కావడం విశేషం.