అన్న క్యాంటీన్లపై టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్త డ్రామా ఆడుతోందని, ఓ 300 మందికి భోజనాలు పెడుతూ, పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారని, అలా అందరినీ మభ్య పెడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గత ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్‌సిక్స్ హామీలను కాస్తా సూపర్‌చీట్‌గా మార్చేశారన్న ఆయన, పేదలకు అందాల్సిన పథకాలన్నింటినీ పక్కన పెట్టేశారని గుర్తు చేశారు. చాలా చోట్ల జన సంచారం లేని చోట్ల అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారన్న అంబటి రాంబాబు, ఆ క్యాంటీన్లకు పచ్చ రంగులు ఎలా వేస్తారని ప్రశ్నించారు. అవి పార్టీ ఏర్పాటు చేసినవి కాదు కదా? అని నిలదీశారు. గతంలో అన్న క్యాంటీన్ల నిర్మాణంలో అంతులేని అవినీతి జరిగిందని, ఈ విషయాన్ని నిపుణుల కమిటీ నిగ్గు తేల్చిందని వెల్లడించారు.