పెట్టుబడిదారులను ఆకర్షించి రాష్ట్రంలో పరిశ్రమలను నెలకొల్పేలా ప్రోత్సహించడంతోపాటు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి తగిన సూచనలు, సలహాలతో ప్రణాళికలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనుంది. దీనికి స్వయంగా చంద్రబాబే చైర్మన్‌గా, దిగ్గజ పారిశ్రామిక సంస్థ టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కో-చైర్మన్‌గా ఉంటారు. ఇందులో దేశంలో పేరుమోసిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆయా రంగా నిపుణులు కూడా సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ దృష్టిపెడుతుంది. నటరాజన్ చంద్రశేఖరన్ శుక్రవారమిక్కడ అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047 రూపకల్పన, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు ప్రైవేటు పారిశ్రామిక సంస్థల నుంచి పెద్దఎత్తున పెట్టుబడులను సాధించే అంశంపైనా విస్తృతంగా చర్చించారు.