రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై రెండేళ్లు దాటిపోయింది. అయితే సుదీర్ఘంగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఏ దేశమూ పై చేయి సాధించలేదు. అలాగని ఏ దేశమూ వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఎటూ సాగకుండా ఆ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు సైతం ఎలాంటి ప్రభావం చూపడం లేదు. ఈ క్రమంలోనే యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. యుద్ధం విరమించాలని ఇప్పటివరకు పలుమార్లు ఇరు దేశాల అధినేతలకు సూచించిన మోదీ.. ఈసారి ఏకంగా ఉక్రెయిన్‌లోనే పర్యటించడం విశేషం.
నరేంద్ర మోదీ ఈ నెల 23 వ తేదీన కీవ్‌లో పర్యటించనున్నారు. అయితే ఇతర దేశాల మాదిరిగా విమానాల్లో కాకుండా.. రైలులో ఉక్రెయిన్ రాజధానికి చేరుకోనున్నారు. అత్యంత సురక్షితమైన రైలుగా పేరు గాంచిన ట్రైన్ ఫోర్స్ వన్‌లో ప్రధాని మోదీ కీవ్ చేరుకోనున్నారు. ఇప్పటివరకు యుద్ధం సందర్భంగా కీవ్‌లో పర్యటించిన ప్రపంచ దేశాధినేతలు అందరూ ఈ ట్రైన్ ఫోర్స్ వన్‌లోనే ప్రయాణించడం గమనార్హం. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేపట్టిన నాటి నుంచి కీవ్‌కు విమానంలో వెళ్లడం అంత సురక్షితం కాకపోవడంతో అప్పటి నుంచి ఉక్రెయిన్ ఈ రైలు మార్గాన్ని ఎంచుకుంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్.. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ సహా పలు ప్రపంచ దేశాల అధినేతలు ట్రైన్ ఫోర్స్ వన్‌లోనే ప్రయాణించి కీవ్‌కు చేరుకున్నారు. అప్పటి నుంచి ఈ రైలు పేరు ట్రైన్ ఫోర్స్ వన్ లేదా రైల్ ఫోర్స్ వన్‌గా మారిపోయింది. అంతేకాకుండా ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభం అయిన సమయంలో లక్షలాది మంది ఉక్రెయిన్ వాసులను సురక్షిత ప్రాంతాలకు ఈ రైలు తరలించింది. ఇప్పుడు దౌత్యపరమైన చర్చలకు ఇదే లైఫ్‌లైన్‌గా మారింది.
ఇక ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ.. మొదట పోలండ్‌కు వెళ్లనున్నారు. ఆ తర్వాత పోలండ్ నుంచి ఈ ట్రైన్ ఫోర్స్ వన్ రైలులో 10 గంటలు ప్రయాణించి కీవ్‌కు చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలోనూ మరో 10 గంటలు ప్రయాణిస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే మోదీ ప్రయాణం కోసం భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఈ ట్రైన్ ఫోర్స్ వన్ రైలులో విలాసవంతమైన క్యాబిన్లు ఉంటాయి. సమావేశాల కోసం పెద్ద పెద్ద టేబుల్స్, సోఫా, టీవీతో పాటు రెస్ట్ తీసుకునేందుకు సౌకర్యవంతమైన బెడ్ రూమ్ కూడా ఉంది. అయితే ప్రస్తుతం యుద్ధం సమయంలో ఈ లగ్జరీ రైలు ప్రయాణించడానికి ఉక్రెయిన్ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రష్యా చేస్తున్న దాడుల కారణంగా తరచూ పవర్ కట్‌లు ఎదురవుతున్న వేళ.. ఈ రైలు ఇంజన్లను కూడా మార్చేశారు. ఈ రైలు టైమింగ్స్ సహా ఇతర వివరాలను బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
మరోవైపు.. గత 30 ఏళ్లలో భారత ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటించనుండడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రష్యా-ఉక్రెయిన్ వివాద పరిష్కారానికి ఆ రెండు దేశాలు దౌత్యపరమైన సంప్రదింపులు, చర్చలు జరుపుకోవాలని భారత్ మొదటి నుంచీ ఒకే విషయాన్ని చెబుతోంది. ఉక్రెయిన్ పర్యటనలో భాగంగా ఈ నెల 23 వ తేదీన ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కీవ్‌లో ప్రధాని మోదీ భేటీ కానున్నారు.