అచ్యుతాపురం ఘటనను ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లి రాజకీయాలు మాట్లాడడం సరికాదన్నారు. బాధితులను ఓదార్చాల్సింది పోయి రాజకీయ విమర్శలకు జగన్ దిగటం సిగ్గుచేటని మంత్రి రవీంద్ర ఆగ్రహించారు. అచ్యుతాపురం ఘటనపై కూటమి ప్రభుత్వం ఘటనపై సరిగా స్పందించలేదంటూ వైసీపీ అధినేత చేసిన వ్యాఖ్యలను మంత్రి కొల్లు రవీంద్ర ఖండించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే హోంమంత్రి అనిత, సీఎం చంద్రబాబు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారని తెలిపారు. ఘటనా స్థలానికి అధికారులు వెళ్లాల్సిందిగా.. బాధితులకు సరైన వైద్యం అందించి అక్కడి పరిస్థితులపై పర్యవేక్షించాలంటూ అధికారులను అప్రమత్తం చేసినట్లు మంత్రి రవీంద్ర చెప్పుకొచ్చారు. తీవ్ర వేదనలో ఉన్న బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పాల్సిన చోట వైఎస్ జగన్ రాజకీయాలు మాట్లాడడం ఆశ్చర్యం కలిగించిందని మంత్రి కొల్లురవీంద్ర అన్నారు.