కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే తాము భయపడమని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విడుదల చేశారని తెలిపారు. ప్రజలకు సంబంధించిన వ్యక్తిపై వివిధ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. వరుసగా నాలుగు సార్లు ఆయన మాచర్ల నుంచి విజయం సాధించారని చెప్పారు. పిన్నెల్లిపై మరిన్ని కేసులు నమోదు చేసి మళ్లీ జైలుకు పంపించాలని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.చంద్రబాబు ఈ విధంగా చేస్తే భవిష్యత్తులో అవన్నీ మళ్లీ పునరావృతమవుతాయన్నారు. ఎవరికీ అధికారం శాశ్వతం కాదని చెప్పారు. చంద్రబాబు చెప్పినట్లు అధికారులు చేయొద్దన్నారు. అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోతే ఆయన కోడుకుతో పాటూ హైదరాబాద్ కు వెళ్లిపోతారని ఆరోపించారు. అధికారులు ఇక్కడే ఉండాల్సి ఉంటుందని చెప్పారు.వంద రోజుల్లో మంచి పాలన అందిస్తానని చెప్పిన చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసులు.. అరెస్టులు.. జైళ్లకు భయపడమని అన్నారు. అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు ఎదురవు తున్నాయని కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు.