నంద్యాల పట్టణంలోని స్టేట్ బ్యాంక్ కాలనీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహానందీశ్వర స్వామి దేవస్థానం భూముల్లో అక్రమంగా నిర్మించిన భవనాలు తొలగిస్తు్ండగా.. ఆక్రమణదారులు దేవాదాయశాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో స్థానికంగా వాతావరణం వేడెక్కింది. నంద్యాల పట్టణంలోని మహానందీశ్వరస్వామికి చెందిన దాదాపు 3.78ఎకరాల్లోని 2ఎకరాల భూమిలో అక్రమంగా ఇళ్లులు కట్టారు. గతంలో వాటిని తొలగించేందుకు దేవాదాయశాఖ అధికారులు ప్రయత్నించగా ఆక్రమణదారులు అడ్డుకున్నారు. దీంతో 27మందిపై కేసులు నమోదు అయ్యాయి. అయితే ఆ భూములు తమవే అంటూ వారంతా కోర్టుకు వెళ్లారు. విచారణ అనంతరం భూములు దేవాదాయశాఖకు చెందినవిగా కోర్టు తీర్పునిచ్చింది. నిర్మాణాలు తొలగించి స్వాధీనం చేసుకోవాలని తీర్పులో పేర్కొంది. తీర్పు వచ్చిన నేపథ్యంలో అధికారుల బృందం జేసీబీలు తీసుకుని భవనాలు తొలగించేందుకు వెళ్లారు. పెద్దఎత్తున చేరుకున్న స్థానికులు దేవాదాయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమ ఇళ్లు కూల్చేందుకు ఒప్పుకోమంటూ ఆందోళనకు దిగారు. వారి నిరసనతో ఘటనా స్థలానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.