రష్యాలో ఇస్లామిక్ స్టేట్ శుక్రవారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. వాల్గోగ్రాడ్‌లోని సురోవ్కినో జైలులో దాడికి తెగబడిన ఉగ్రవాదులు.. నలుగురు గార్డులను కత్తులతో పొడిచి చంపారు. తొలుత మొత్తం ఎనిమిది మంది జైలు గార్డులతో పాటు మరో నలుగురు తోటి ఖైదీలను బందీలుగా చేసుకున్నారు. ఆపై గార్డులపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు గార్డులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వెంటనే అప్రమత్తమైన రష్యా నేషనల్ గార్డ్స్ రంగంలోకి దిగి.. నలుగురు ఉగ్రవాద ఖైదీలను కాల్చి చంపారు.
శుక్రవారం నాడు జైలులో రోజువారీ సాధారణ క్రమశిక్షణా సంఘం సమావేశం జరుగుతుండగా ఖైదీలు రామ్‌జిదిన్ తోషెవ్ (28) రుస్తామ్‌చోన్ నవ్రూజీ (23), నజిర్చోన్ తోషోవ్ (28), టెమూర్ ఖుసినోవ్ (29)లు దాడికి దిగారు. ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్‌కు చెందిన ఈ నలుగురూ గార్డులను కత్తులతో నరికి, అనేకమందిపై దాడి చేశారు. ఎనిమిది మంది జైలు ఉద్యోగులు, నలుగురు తోటి ఖైదీలను బందీలుగా చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి. వీడియోను విడుదల చేసిన తీవ్రవాదులు.. ముస్లింలపై హింసకు ప్రతీకారంగా ఈ చర్యకు దిగినట్టు తెలిపారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా సాయుధ బలగాలు, నేషనల్ గార్డ్స్ సహా రష్యా ప్రత్యేక దళాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. ఆపరేషన్ చేపట్టి.. నలుగురు ఉగ్రవాద ఖైదీలను కాల్చిచంపారు. ఇటీవల నెలల్లో రష్యాలో ఇటువంటి ఘటన జరగడం ఇది రెండోసారి. జూన్ నెలలో రోస్తోవ్ ప్రాంతంలోని ఓ జైల్లో ఐఎస్ ఉగ్రవాద ఖైదీలు తిరగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
వోల్గోగ్రాడ్ ఘటన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భద్రతా చీఫ్‌లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందని, తక్షణ ముప్పు లేదని వివరించారు. ‘మా భూభాగంలో ఉన్న ప్రతి ఒక్కరికీ రష్యా చట్టాలను గౌరవించి, పాటించాల్సిన బాధ్యత ఉంది.. వైరుధ్యాన్ని రెచ్చగొట్టడానికి మేము ఎవరినీ అనుమతించం’ అని వోల్గోగ్రాడ్ ప్రాంతీయ గవర్నర్ ఆండ్రీ బోచారోవ్ అన్నారు.