తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయం.. ఆదివారం ఉదయం కాసేపు సైనికుల చప్పుళ్లు, సైరన్లతో మార్మోగింది. సైనికులు అటూ ఇటూ పరుగులు తీస్తూ కనిపించారు. అయితే మాక్ డ్రిల్‌లో భాగంగా ఇదంతా జరిగింది. అనుకోని పరిస్థితులు తలెత్తితే ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఆక్టోపస్ దళాలు ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆక్టోపస్ దళాలు.. బృందాలుగా విడిపోయి ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కూడా ఇందులో పాలుపంచుకున్నారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాల్లోకి ముష్కరులు చొరబడితే వారిని ఎలా ఎదుర్కొనాలనే దానిపై ఇలా మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగానే తిరుచానూరు అమ్మవారి ఆలయంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్‌లో భాగంగా ఉగ్రవాదులు చొరబడితే. లేదా ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఎలా ఎదుర్కోవాలి, భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను... ఆక్టోపస్ సిబ్బంది మాక్ డ్రిల్ ద్వారా చేసి చూపించారు.
తిరుమలలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి తనిఖీలు
మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదివారం తిరుమలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నాలుగు మాడ వీధులతోపాటు లడ్డూ కౌంటర్లను ఆయన పరిశీలించారు. అక్టోబర్ 4 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గరుడ సేవ రోజున లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఎంట్రీ మరియు ఎగ్జిట్ మార్గాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. అనంతరం లడ్డూ ప్రసాదం కాంప్లెక్స్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు. భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటే.. త్వరితగతిన లడ్డూలను పంపిణీ చేయాలని అధికారులకు సూచనలు చేశారు.
తిరుపతిలో దివ్యదర్శనం టోకెన్ల కేంద్రం తనిఖీ
మరోవైపు తిరుపతిలోని అలిపిరి సమీపంలో ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో దివ్య దర్శనం టోకెన్ల జారీ కేంద్రాన్ని టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. అలిపిరి వద్ద శ్రీవారి భక్తులకు ఇదివరకు జారీ చేస్తున్న దివ్యదర్శనం టోకెన్లను మళ్లీ ప్రారంభించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. అలాగే ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీ ప్రక్రియను పరిశీలించారు. తిరుమల శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా టోకెన్లు జారీ చేయడానికి శాశ్వత క్యూలైన్లు, ఇతర అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.