ఒంగోలులోని ప్రకాశం జిల్లా గనుల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. శనివారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో జరిగిన తనిఖీల్లో గత ఐదేళ్లలో జిల్లాలో జరిగిన ఇసుక రీచ్‌ల కేటాయింపులు, ఇతరత్రా కీలక అంశాలపై ఆరా తీశారు. ముఖ్యంగా ఇసుక తవ్వకాలకు సంబంధించి జేపీ వెంచర్స్‌కు ఇచ్చిన అనుమతుల గురించి విచారించినట్లు తెలిసింది. కార్యాలయం గేట్లు మూసివేసి సిబ్బందిని మాత్రమే లోపలికి అనుమతించారు. రికార్డులను నిశితంగా పరిశీలించారు. ప్రకాశం జిల్లాలో ఇసుక తవ్వకాల లీజును వైసీపీ హయాంలో జేపీ వెంచర్స్‌కు ఇచ్చారు. అయితే, జేపీ వెంచర్స్ అప్పట్లో అడ్డగోలుగా తవ్వకాలు, అక్రమ రవాణా చేసినట్లు ఆరోపణలున్నాయి. వీటిపై ఏసీబీ అధికారులు సమగ్రంగా విచారించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి ఎంత చెల్లించారు? అసలు బిల్లులు లేకుండా ఇసుక అక్రమ రవాణా ఎలా జరిగింది? అన్న విషయాలపై కూడా లోతుగా ఆరా తీసినట్లు సమాచారం. ఇసుక తవ్వకాలకు సంబంధించి జేపీ వెంచర్స్ ప్రభుత్వానికి రూ.13 కోట్లు చెల్లించాల్సి ఉందని గనుల శాఖ గతంలో నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. అయితే, ఆ మొత్తాన్ని ఇప్పటి వరకు చెల్లించలేదు. దీంతో బకాయిలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఏసీబీ అధికారులు సేకరించినట్లు తెలిసింది. కాగా, ఇసుక టెండర్లలో గనుల శాఖ మాజీ డైరెక్టర్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఏసీబీ అధికారుల తనిఖీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.