రాష్ట్రంలో ఫైబర్ నెట్ సేవలను మరింతగా విస్తరిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. దీనికిగాను తక్షణమే 35 లక్షల కస్టమైజ్డ్ ప్రెమిసెస్ ఎక్వి్‌పమెంట్(సీపీఈ)లను ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. అదేవిధంగా ‘భారత్ నెట్’ రెండో దశ కింద రూ.635 కోట్లను రీయింబర్స్‌మెంట్ చేయాలని విన్నవించింది. ఈ మేరకు రాష్ట్ర మౌలిక సదుపాయాలకల్పన శాఖ కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్, ఫైబర్ నెట్ ఎండీ కె. దినేశ్‌కుమార్ శనివారం ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర టెలీకమ్యూకేషన్ల శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్‌తో భేటీ అయి అభ్యర్థించారు. రాష్ట్రంలో భారత్‌నెట్-1 కింద అమలు చేసిన ఫైబర్‌నెట్ సేవలు విజయవంతమయ్యాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానికి సురేశ్‌కుమార్ వివరించారు. రాష్ట్రంలో అమలు చేసిన సాంకేతిక విధానం జాతీయస్థాయిలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. తొలిదశలో 9.7 లక్షల కనెక్షన్లు ఇచ్చామని, వీటిలో కొన్ని కనెక్షన్లు పోగా ప్రస్తుతం 5 లక్షల ఇళ్లకు ఫైబర్ నెట్ సేవలు అందుతున్నాయని సురేశ్‌కుమార్ వివరించారు. వీటితో పాటు 6,200 పాఠశాలలు, 1,978 ఆరోగ్య కేంద్రాలు, 11,254 గ్రామ పంచాయితీలు, 193 టెలికం టవర్లు, 9,104 ప్రభుత్వ సంస్థలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఫైబర్ నెట్ సేవలు విస్తరించేందుకు సీపీఈల అవసరం చాలా ఉందన్నారు. తక్షణమే 35 లక్షల సీపీఈ బాక్సులు కావాలని కోరారు. భారత్ నెట్-1 కింద ఉమ్మడి విశాఖ, చిత్తూరు జిల్లాల్లోని 57 మండలాలు, 1,692 గ్రామపంచాయతీలలో ఫైబర్‌నెట్ సేవలు అందించామన్నారు. రాష్ట్రంలో ఈ సేవలు విస్తరించేందుకు వీలుగా భారత్ నెట్ 2వ దశ కింద రూ.635 కోట్లను తక్షణమే రీయింబర్స్‌మెంట్ చేయాలని కోరారు.