ఢిల్లీ: దేశంలోనే వేగవంతమైన రైలుగా గుర్తింపు పొందిన ట్రైన్ 18 (వందేభారత్ ఎక్స్‌ప్రెస్)పై మరోసారి రాళ్లదాడి జరిగింది. శుక్రవారం రాత్రి ట్రయల్ రన్ జరుపుకుంటున్న సమయంలో ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో రైలు అద్దం పగిలింది. నెల రోజుల కిందట కూడా ఇలాంటి ఘటనే జరిగిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి అలహాబాద్‌కు ట్రయల్ రన్ నిర్వహించడానికి వస్తున్న సమయంలో శకుర్‌బస్తీ దగ్గర శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. అయితే ఇందులో ఎవరూ గాయపడలేదు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ కూడా చేయలేదు. ట్రయల్ రన్ సందర్భంగా రైల్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది కూడా ఉన్నారు. ముందు భాగం నుంచి రెండో బోగీ ఈ రాళ్ల దాడిలో దెబ్బతిన్నది. ఢిల్లీ స్టేషన్‌కు వచ్చిన తర్వాత ఈ దాడి ఘటన గురించి ఆర్పీఎఫ్ అధికారులకు సమాచారం అందించారు. ఇప్పటివరకు ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారన్నది తేలలేదు. ఇంతకుముందు డిసెంబర్ 20న ఢిల్లీ, ఆగ్రా మధ్య ట్రయల్ రన్ సందర్భంగా కూడా ఈ రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఇది స్వదేశంలో తయారైన తొలి ఇంజిన్ రహిత రైలు కావడం విశేషం. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ రైలు తయారైంది. ఈ మధ్య గంటలకు 180 కిలోమీటర్ల వేగం అందుకొని వేగవంతమైన రైలుగా గుర్తింపు సాధించింది. దేశంలోని శతాబ్ది రైళ్ల స్థానంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa