పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ ఘటనలో విచారణపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా భాజపా బుధవారం 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది.మంగళవారం జరిగిన 'నబన్నా అభియాన్' ర్యాలీలో విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, బాష్పవాయువు ప్రయోగించడం పట్ల పార్టీ మండిపడుతూ ఈ బంద్ చేపట్టింది. దీంతో బెంగాల్ స్తంభించింది.పలుచోట్ల దుకాణాలను మూసివేస్తూ భాజపా శ్రేణులు ఆందోళన చేపట్టాయి. బంద్ కారణంగా రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. పట్టాలపై ఆందోళనకారులు నిరసనకు దిగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. అటు బంద్ దృష్ట్యా విమానయాన సంస్థలు కూడా ప్రయాణికులకు అలర్ట్‌లు జారీ చేశాయి.మరోవైపు, భాజపా ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ఇద్దరు భాజపా ఎమ్మెల్యేలు సహా పలువురు కార్యకర్తలను అరెస్టు చేసి మరో చోటుకు తరలించారు. ఇదిలా ఉండగా.. ఆందోళనల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా బస్సు డ్రైవర్లు హెల్మెట్లు ధరించి వాహనాలు నడుపుతున్నారు.