ప్రధానమంత్రి జన్-ధన్ యోజన ప్రారంభించి దశాబ్దకాలం పూర్తయింది.. నరేంద్ర మోదీ ప్రధానిగా తన తొలి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో 2014 ఆగస్ట్ 15న ‘ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన’ పథకం ప్రకటన చేశారు. 2014 ఆగస్టు 28న ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) పథకాన్ని ప్రధాని మోదీ విజయవంతంగా ప్రారంభించారు. ఆర్థిక వ్యవస్థకు వెలుపలే ఉండిపోయిన కోట్లాది మందికి బ్యాంకు ఖాతాలను అందించి.. అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తెచ్చే సవాలుతో అప్పటి కొత్త ఎన్డీఏ ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చేపట్టి.. అద్భుతమైన విజయం సాధించింది. 2024 ఆగస్టు 14 నాటికి 53.13 కోట్ల మంది జన్ ధన్ యోజన లబ్ధిదారులుగా ఉండగా, వారు జమచేసిన మొత్తం రూ.2.31 లక్షల కోట్లు అయినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.. ఈ లబ్ధిదారుల్లో దాదాపు ముప్పై కోట్ల మంది మహిళలు ఉండటం గమనార్హం.. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత కార్యక్రమం పీఎంజేడీవై.. అట్టడుగున మిగిలిపోయిన, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చేయూతను అందించేందుకు మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.
ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (PMJDY) పథకానికి పదో వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో కీలక ట్విట్ చేశారు.. భారతదేశం అంతటా ఆర్థిక చేరికను పెంపొందించడంలో PMJDY చొరవను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుర్తుచేశారు. ఇది అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పించడంలో ప్రభావం చూపిందని తెలిపారు. “ఈ రోజు, ఒక ముఖ్యమైన సందర్భాన్ని గుర్తించాము. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకానికి పదేళ్లు (#10YearsOfJanDhan).. ఈ పథకం విజయవంతం కావడానికి కృషి చేసిన లబ్ధిదారులందరికీ అభినందనలు.. జన్ ధన్ యోజన కోట్లాది మందికి ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలో, గౌరవాన్ని అందించడంలో సహాయపడింది. ముఖ్యంగా మహిళలు, యువత.. అట్టడుగు వర్గాలకు గౌరవాన్ని కల్పించడంలో ప్రధానమైనది.’’.. అంటూ మోదీ ట్వీట్ చేశారు.