ఆన్లైన్ పాస్‌పోర్టు సేవలకు స్వల్ప అంతరాయం కలగనుంది. గురువారం రాత్రి నుంచి ఐదు రోజుల పాటు ఈ సేవలు అందుబాటులో ఉండవని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది.ఆన్లైన్ పోర్టల్ నిర్వహణ సంబంధిత కార్యకలాపాల కోసం వాటిని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ వ్యవధిలో కొత్త అపాయింట్మెంట్లు ఏవీ షెడ్యూల్ చేసే వీలు ఉండదని, అలాగే ఇప్పటికే చేసుకున్న బుకింగ్‌లు రీషెడ్యూల్ అవుతాయని పేర్కొంది.''సాంకేతిక నిర్వహణ సంబంధిత కార్యకలాపాల దృష్ట్యా పాస్‌పోర్టు సేవా పోర్టల్ సేవలు గురువారం రాత్రి ఎనిమిది గంటల (ఆగస్టు 29) నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల(సెప్టెబర్ 2) వరకు అందుబాటులో ఉండవు. ఆగస్టు 30కి చేసుకున్న అపాయింట్మెంట్లు రీషెడ్యూల్ అవుతాయి. దీనికి సంబంధించిన వివరాలను దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి అందిస్తాం'' అని పాస్‌పోర్టు సేవా పోర్టల్ పేర్కొంది.
దీనిపై భారత విదేశాంగశాఖ స్పందించింది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియే అని తెలిపింది. దీనివల్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రణాళిక ప్రకారమే ముందుకువెళ్తున్నామని వెల్లడించింది. ఈ పాస్‌పోర్టు సేవా పోర్టల్ ద్వారా కొత్త పాస్‌సోర్టులు లేక వాటి పునరుద్ధరణ కోసం దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో అపాయింట్మెంట్లు బుక్ చేసుకుంటారు. అపాయింట్మెంట్ రోజున దరఖాస్తుదారుడు పాస్‌పోర్టు కేంద్రానికి వెళ్లాలి. అక్కడ పత్రాల వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ తర్వాత పోలీసు వెరిఫికేషన్ ఉంటుంది. అనంతరం అది దరఖాస్తుదారుడు పొందుపరిచిన చిరునామాకు చేరుతుంది. పాస్‌పోర్టును వేగంగా పొందేందుకు తత్కాల్ విధానమూ అందుబాటులో ఉంది.