ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం నేడు మరింత బలపడనుందని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు పయనిస్తూ రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందంటున్నారు. ఈ ప్రభావంతో శుక్ర, శనివారాల్లో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటున్నారు వాతావరణశాఖ అధికారులు. అయితే దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురవొచ్చంటున్నారు.
ఈ అల్పపీడనం ప్రభావంతో ఆదివారం వరకు సముద్రం అలజడిగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుంది కాబట్టి.. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కోస్తా తీరం వెంబడి గంటకు 44 నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయి అంటున్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో అత్యవసర సహాయం కోసం 1070, 112, 18004250101 నంబర్లలో సంప్రదించాలన్నారు.
మరోవైపు ఇవాళ అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతేకాదు ప్రస్తుతం వైరల్ జ్వరాలు ఉన్నాయని.. వర్షంలో తడవద్దని, అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నగరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జీవీఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.. నగర ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతోపాటు, ఆపదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు వీలుగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్, కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్‌రూమ్ టోల్‌ఫ్రీ నంబర్ 180042500009కి ఫోన్ చేస్తే వెంటనే సహాయం అందజేస్తామన్నారు.