కేరళలోని వయనాడ్ జిల్లాలో నెల రోజుల క్రితం విరిగిపడ్డ కొండ చరియలు దేశం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఇప్పటికే ఈ ప్రకృతి విపత్తులో 4 వందల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. మరికొందరి ఆచూకీ ఇంకా దొరకలేదు. కొన్ని గ్రామాలు మొత్తం నేలమట్టం కాగా.. జనం వాటి కింద శిథిలాల్లో చిక్కుకుపోయారు. ఇక ప్రాణాలతో బయటపడిన వారికి ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు లేకుండా కట్టుబట్టలతో బ్రతుకు జీవుడా అంటూ ఉన్న ఇల్లు, ఊరు వదిలిపెట్టి ప్రభుత్వ క్యాంపుల్లో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వారిన ఆదుకునేందుకు ప్రభుత్వాలతోపాటు సెలబ్రిటీలు కూడా ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే సినిమా, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించారు.
తాజాగా స్నేహా గ్రూప్ కూడా వయనాడ్ వరద, కొండ చరియల బాధితులకు భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. స్నేహా ఫౌండేషన్ తరఫున రూ.25 లక్షలను .. ఆ సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి. రాంరెడ్డి.. ముఖ్యమంత్రి సహాయనిధికి ఇచ్చారు. ఆ చెక్కును స్వయంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు అందించారు. వయనాడ్ జిల్లాలోని బాధితులకు సహాయం అందించేందుకు ఈ విరాళం ఇచ్చినట్లు స్నేహా గ్రూపు ఛైర్మన్ డి. రాంరెడ్డి వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే స్నేహా గ్రూప్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కష్ట సమయంలో వయనాడ్ ప్రజల తరఫున నిలబడేందుకు ఈ సాయం చేసినట్లు తెలిపింది. ఈ సమయంలోనే ప్రజలు అంతా సమిష్టిగా ఉండి.. బాధితులకు సహాయం చేయాలని ఆ సంస్థ పిలుపునిచ్చింది. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా వయనాడ్ ప్రజలు పడుతున్న కష్టాల నుంచి బయటపడేందుకు, విధ్వంసం అయిన ప్రాంతాన్ని పునర్నిర్మించడానికి సహాయం చేయడానికి స్నేహా గ్రూపు ఈ రూ.25 లక్షల సహాయాన్ని అందించిందని తెలిపింది.
జులై 30 వ తేదీన తెల్లవారుజామున వయనాడ్ జిల్లాలోని కొన్ని గ్రామాలపై కొండ చరియలు విరుచుకుపడ్డాయి. వీటి వల్ల కొన్ని గ్రామాలే మొత్తం కనిపించకుండా పోయాయి. 400 మందికిపైగా మృతి చెందారు. మరో వంద మందికిపైగా ఆచూకీ గల్లంతైంది. కొన్ని గ్రామాలు కొండ చరియల కింద మునిగిపోయాయి. ఈ ప్రకృతి విపత్తులో ప్రాణాలే కాకుండా 310 హెక్టార్ల వ్యవసాయ పంటలు మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి. వేలాది మంది ఇళ్లు లేక నిరాశ్రయులయ్యారు. ఇక వయనాడ్ ప్రకృతి విపత్తులో సర్వం కోల్పోయిన ప్రజలను ఆదుకునేందుకు ఇప్పటికే ఎంతో మంది ఆర్థికంగా సహాయం అందించారు.