విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేవారు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.భారీ వర్షాలు, వరదల కారణంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం దగ్గర జాతీయ రహదారిపై మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అలాగే చిల్లకల్లు, నందిగామ దగ్గర జాతీయ రహదారి మీదకు నీళ్లు వచ్చాయి. పాలేరు నది పొంగడం, సూర్యాపేట తర్వాత రామాపురం క్రాస్‌రోడ్డు బ్రిడ్జి కూలడంతో.. ప్రజల భద్రతా కారణాల రీత్యా ప్రయాణం వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు.
ఒకవేళ ఎవరైనా అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో విజయవాడ వెళ్లాలనుకుంటే చౌటుప్పల్, చిట్యాల, నార్కెట్‌పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా వెళ్లాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఖమ్మం వెళ్లాలనుకుంటే చౌటుప్పల్, చిట్యాల, నకిరేకల్, అర్వపల్లి, తుంగతుర్తి, మద్దిరాల, మర్రిపేట బంగ్లా మీదుగా వెళ్లొచ్చని అధికారులు సూచించారు. ఒకవేళ అత్యవసర పరిస్థితి ఎదురైతే సాయం కోసం హెల్ప్‌లైన్ 90102 03626 నంబరులో సంప్రదించాలని సూచించారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం దగ్గర నేషనల్ హైవేపై మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మోకాళ్ళ లోతులో జాతీయ రహదారిపై వరద వస్తుండటంతో వాహనాల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. విజయవాడ- హైదరాబాద్ నేషనల్ హైవే మీదకు వాహనాలు రాకుండా పోలీస్ రెవెన్యూ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ వైపు చిలకల్లు టోల్ ప్లాజా.. విజయవాడ వైపు కీసర టోల్ ప్లాజా దగ్గర వాహనాలను నిలిపివేశారు. ఈ ప్రభావంతో హైవే పూర్తిగా స్తంభించిపోగా.. వరద తగ్గేవరకు హైవేపై ఎవరినీ అనుమతించబోమని నందిగామ ఆర్డీవో రవీందర్‌రావు తెలిపారు.
మరోవైపు ఈ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రాష్ట్రాల సరిహద్దులో రామాపురం దగ్గర చిమిర్యాల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కోదాడ నుంచి వరదనీరు దిగువకు భారీగా వస్తుండటంతో.. నల్లబండగూడెం దగ్గర నేషనల్ హైవే మీదకు నీరు చేరింది. దీంతో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడ నుంచి వచ్చే వాహనాలను అద్దంకి-నార్కట్‌పల్లి వైపు మళ్లించారు అధికారులు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
ప్రజలకు కూడా అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని అధికారులు చెప్తున్నారు. ట్రాఫిక్ డైవర్ట్ చేయడం వల్ల ప్రత్యామ్నాయ మార్గాల్లో కూడా వాహనాల రద్దీ పెరిగే అవకాశం కాబట్టి.. అత్యవసరంగా రావాలనుకునేవారు ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టి, వరదలు కాస్త తగ్గిన తర్వాత మళ్లీ పరిస్థితిని సమీక్షించుకుని విజయవాడ - హైదరాబాద్ హైవేపైకి వాహనాలు అనుమతిస్తామంటున్నారు అధికారులు.