దేశంలో నిత్యం మహిళలపై జరుగుతున్న రేప్‌లు, హత్యాచారాల ఘటనలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. అకృత్యాలు మాత్రం మారడం లేదు. ఇక ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హాస్పిటల్‌లోనే హత్యాచారం జరిగిన ఘటన దేశం మొత్తాన్ని తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేసింది. నిందితుడిని ఉరి తీయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ.. కీలక బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. సమావేశాల తొలిరోజే బిల్లును ప్రవేశపెట్టగా.. ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ బిల్లుకు అపరాజిత మహిళలు, పిల్లల బిల్లు 2024 అని మమతా బెనర్జీ సర్కార్ పేరు పెట్టింది.
ఇక ఈ అపరాజిత మహిళలు, పిల్లల బిల్లు 2024లో కీలక నిబంధనలు విధించారు. అత్యాచారం, హత్యలకు పాల్పడే వారికి మరణశిక్ష విధించే నిబంధనను కూడా పొందు పరిచారు. మరోవైపు.. అత్యాచార ఘటనకు సంబంధించి ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన 36 రోజుల్లోగా దోషులకు మరణశిక్ష విధించే నిబంధనను కూడా చేర్చారు. ఇక ఘటన జరిగిన 21 రోజుల్లోగా కేసు విచారణను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కేసులో నేరస్థుడికి సహాయం చేసేందుకు ప్రయత్నిస్తే వారికి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించనున్నారు.
దీని ప్రకారం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో భికర్ స్పెషల్ అపరాజిత టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. అత్యాచారం, యాసిడ్ దాడి, లైంగి దాడి, వేధింపుల వంటి కేసుల్లో ఈ భికర్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ చర్యలు తీసుకుంటుంది. మరోవైపు.. కేసులో బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేసిన వారిపై 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించనున్నారు. అత్యాచారానికి సంబంధించిన కేసు విచారణను వేగవంతం చేసేందుకు భారతీయ న్యాయ సంహిత నిబంధనల్లో మార్పులు చేసే సవరణలు ఈ బిల్లులో మమతా బెనర్జీ సర్కార్ పొందుపరించింది. మరోవైపు.. అన్ని లైంగిక నేరాలు, యాసిడ్ దాడుల విచారణను 30 రోజుల్లో పూర్తి చేసే నిబంధనను ఇందులో పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలపై మాట్లాడిన సీఎం మమతా బెనర్జీ.. ఈ బిల్లుకు మద్దతుగా అనేక ఉదాహరణలు వివరించారు. 2020లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్‌లో 20 ఏళ్ల దళిత యువతిపై జరిగిన అత్యాచారం.. బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో కాలేజీ స్టూడెంట్‌పై జరిగిన రేప్, గతంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగిన అత్యాచారానికి సంబంధించిన దారుణ ఘటనలను ప్రస్తావించారు. ఇక గత వారం రాజస్థాన్ జైపూర్‌లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారిపై జరిగిన అత్యాచారం ఘటనను ప్రస్తావించారు. యూపీ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న నేరాల రేటు ఎక్కువగా ఉందని.. అక్కడ న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. కానీ బెంగాల్ మహిళలకు కోర్టుల్లో న్యాయం జరుగుతుందని దీదీ ఆశాభావం వ్యక్తం చేశారు.