తెలుగు రాష్ట్రాలను వరణుడు ఎంతలా వణికిస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. తెలంగాణలో ఖమ్మం, వరంగల్ జిల్లాలు, ఏపీలో విజయవాడ జిల్లా వరదలతో తీవ్రంగా ప్రభావితమైంది. వేల సంఖ్యలో ప్రజలు ఇంకా బిల్డింగ్‌లపై చిక్కుకుపోయారు. తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. కాపాడేందుకు అధికారుల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరి కొందరు సాహసం చేసి నీళ్లలో నుంచి ఒక చోటు నుంచి మరోచోటుకి ప్రయాణిస్తున్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో వేల కోట్ల ఆస్తినష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నాయి. అయితే విజయవాడలో ఓ పసికూన ప్రాణాలు కాపాడేందుకు ఇద్దరు చేసిన సాహాసానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నగరంలోని సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ ఇల్లు వరద నీటిలో మునిగిపోయింది. అందులో ఉంటున్న కుటుంబం వెంట నెలలు నిండిన శిశువు ఉంది. చుట్టూ వరద నిండటంతో విషకీటకాలు, పాములు వచ్చే అవకాశం ఉండటం, అపరిశుభ్ర వాతావరణంలో శిశువుకు ప్రమాదం పొంచి ఉండటంతో శిశువును సురక్షిత ప్రాంతానికి తరలించాలని నిర్ణయించారు. అనంతరం ఇద్దరు వ్యక్తులు ప్లాస్టిక్ డబ్బాలో శిశువును పడుకోబెట్టి, పీకల్లోతు నీటిలో నిదానంగా నడుచుకుంటూ వెళ్తూ.. సురక్షిత ప్రాంతానికి తరలించారు. దీనిని ఓ నెటిజన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది కాస్త వైరల్ కావడంతో, వారి సాహసానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చిన్నారిని సాహసోపేతంగా సురక్షిత ప్రాంతానికి తరలించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.