ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బుడమేరుపై మరోసారి రెడ్ అలర్ట్.. సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని ప్రజలకు సూచన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 09, 2024, 07:48 PM

విజయవాడను వణికించిన బుడమేరుపై అధికారులు మరోసారి హై అలర్ట్ ప్రకటించారు. బుడమేరు ప్రవాహ ప్రాంతాలలో ప్రజల్ని అలర్ట్ చేశారు. లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర రెడ్ అలెర్ట్ జారీ చేశారు. బుడమేరు ప్రవాహిక ప్రాంతాల్లో లోతట్టు ప్రదేశాలలో నివసిస్తున్న ప్రజలు వరద ముంపు ఉండటం వలన వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలిరావాలని సూచించారు.


బుడమేరు పరీవాహక ప్రాంతంలో నిరంతరంయంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో, భారీ వర్షపాతం అంచనా వేశారని.. బుడమేరు నదికి ఎప్పుడైనా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. అందుకే బుడమేరు ప్రవాహ ప్రాంతాలు, లోతట్టు ప్రదేశాలలో నివసిస్తున్న ప్రజలు వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లాలన్నారు.


మరోవైపు ఇరిగేషన్ శాఖ వారి సూచనల ప్రకారం విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న బుడమేరు ప్రవాహ ప్రాంతాలైన గుణదల, సింగనగర్, పరిసర ప్రాంతాలు వరద ముంపు కు గురయ్య అవకాశం ఉందంటున్నారు. అందుకే అక్కడ ఉంటున్న ప్రజలందరూ వెంటనే సురక్షితమైన ప్రదేశాలకి తరలి రావాలి అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వానికి సహకరించాలన్నారు.


ఇదిలా ఉంటే.. విజయవాడలోని ప్రకాశం బ్యారేజి గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర కోణం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఒక్కోటి 40 నుంచి 50 టన్నుల బరువున్న బోట్లు.. ఢీకొడితే బ్యారేజి గేట్లు దెబ్బతిని కొట్టుకుపోతాయని.. తద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలనే దురుద్దేశంతోనే వాటిని గట్టిగా కట్టకుండా వదిలేశారని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేసిన విజయవాడ పోలీసులు.. నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు.


పోలీసులు ప్రకాశం బ్యారేజీ గేట్లను మొత్తం ఐదు పడవలు అందులో మూడు గొల్లపూడికి చెందిన వక్కలగడ్డ ఉషాద్రి అనే వ్యక్తివని తేల్చారు. ఈయన సూరాయపాలెంకు చెందిన కోమటి రామ్మోహన్‌కు అనుచరుడు కాగా.. రామ్మోహన్ వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌కు దగ్గరి బంధువని పోలీసులు గుర్తించారు. ఘటన జరిగి ఇన్నిరోజులైనా ఇప్పటివరకు ఈ బోట్లు తమవేనని ఎవ్వరూ రాకపోవడమే కుట్ర కోణం ఉందనడానికి నిదర్శనమని పోలీసులు నివేదికలో పేర్కొన్నారు. బ్యారేజీని ఢీకొన్న బోట్లు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలవేనని నిర్ధారించారు. అవన్నీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అనుచరుల బోట్లుగా గుర్తించామని... ఇసుక అక్రమ తవ్వకాల కోసం నందిగం సురేష్ ఈ బోట్లనే వినియోగించుకునేవారని నివేదికలో పేర్కొన్నారు. బోట్ల రిజిస్ట్రేషన్ నంబర్ల ఆధారంగా యజమానులను ఉషాద్రి, కర్రి నరసింహా స్వామి, గూడూరు నాగమల్లేశ్వరీలుగా గుర్తించినట్లు వెల్లడించారు.


సాధారణంగా పడవల్ని దేనికదే వేర్వేరుగా నది ఒడ్డున లంగరు వేసి కట్టి ఉంచుతారు. ఇక్కడ మాత్రం మూడు పడవల్నీ కలిపి ప్లాస్టిక్‌ తాళ్లతో కట్టి ఉంచారు. కృష్ణా నదిలో నీటిమట్టం పెరుగుతున్న సమయంలో.. ఏ పడవకు ఆ పడవను లంగరేసి గట్టిగా కట్టమని స్థానికులు హెచ్చరించినా యజమానులు పట్టించుకోలేదని పోలీసులు నివేదికలో వెల్లడించారు. పెద్ద పడవలు కావడంతో అవి బ్యారేజి వద్దకు కొట్టుకుపోయి ప్రమాదం జరుగుతుందని చెప్పినా నిర్లక్ష్యం చేశారని ప్రత్యక్ష సాక్షలు చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది చర్చనీయాంశంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com