ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బోర్డు లేకుండానే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 11, 2024, 09:28 PM

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబవుతోంది. అక్టోబర్ 3 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీంతో తిరుమలలో సుందరీకరణ పనులు వేగవంతంంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు టీటీడీ పాలకమండలి లేకుండానే జరగబోతున్నాయనే చర్చ జరుగుతోంది. మరో మూడు వారాల్లో బ్రహ్మోత్సవాలు జరగనుండగా.. ప్రభుత్వం ఇప్పటి వరకు పాలకమండలి ఏర్పాటు దిశగా అడుగులు వేయలేదు. దీంతో ఈసారికి అధికారులే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి గత నెలలో పాలకమండలి అంశం తెరపైకి వచ్చినా.. ఆ తర్వాత మళ్లీ పక్కన పెట్టేశారు.


ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా.. బ్రహ్మోత్సవాలలోపు టీటీడీ పాలకమండలి నియామకం కష్టమనే భావన వ్యక్తమవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో బుడమేరు వరద విజయవాడను ముంచెత్తింది. వర్షాలు ఉత్తరాంధ్రతో పాటూ కోస్తాలోని మరికొన్ని జిల్లాల్లో తీరని నష్టాన్ని మిగిల్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు.. ఇలా అధికార యంత్రాంగం మొత్తం ఈ వరద సహాయక కార్యక్రమాల్లో బిజీగా ఉంది. వరదల వాటిల్లిన ఆస్తి నష్టం, పంట నష్టాన్ని అంచనాలు వేసే పనుల్లో ఉన్నారు. మరోవైపు గోదావరికి వరద పెరుగుతోంది. కాబట్టి మరో రెండు వారాల పాటూ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వరదలకు సంబంధించిన పనుల్లోనే బిజీగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీటీడీ పాలకమండలి ఏర్పాటు సాధ్యం కాకపోవచ్చు.


దీంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలను పాలకమండలి లేకుండానే నిర్వహించే అవకాశం ఎక్కువగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి టీటీడీ బాధ్యతలను ఈవో జే శ్యామలరావు చూసుకుంటున్నారు.. ఆయనతో పాటూ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కూడా టీటీడీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఇద్దరు అధికారులు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. పాలకమండలి గురించి పట్టించుకోకుండా.. బ్రహ్మోత్సవాల పనులను ఈ అధికారులిద్దరూ వేగవంతం చేశారు.


ప్రతి ఏటా బ్రహోత్సవాలకు ముందు టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించడం ఆనవాయితీ.. బ్రహ్మోత్సవాల నిర్వహణతో పాటూ ఇతర అంశాలపై కీలక నిర్ణయాలు ప్రకటిస్తుంటారు. కానీ ఈసారి మాత్రం పాలకమండలి ఏర్పాటుకాకపోవడంతో అధికారులే ఆ బాధ్యతల్ని చూసుకుంటున్నారు. అలాగే బ్రహ్మోత్సవాలకు ముందు ముఖ్యమంత్రిని టీటీడీ తరఫున పాలకమండలి ఛైర్మన్, ఈవోలు ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. ఒకవేళ శ్రీవారి బ్రహోత్సవాాలు ప్రారంభమయ్యే సమయానికి టీటీడీ పాలకమండలి నియామకం కనుక జరగకపోతే.. టీటీడీ ఈవోనే ముఖ్యమంత్రికి ఆహ్వానం అందించే అవకాశం ఉంది.


పాలకమండలి నియమాకం ఆలస్యానికి కారణం ఏంటి?


కూటమి ప్రభుత్వానికి టీటీడీ పాలకమండలి కూర్పు మొదటి నుంచి తలనొప్పిగా మారిందనే చెప్పాలి. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే.. టీటీడీ ఛైర్మన్ పదవి ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేసినట్లు ప్రచారం జరిగింది. ఇద్దరు, ముగ్గురు పేర్లు తెరపైకి వచ్చాయి.. టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత కొద్దిరోజులకు ఓ తెలుగు టాప్ న్యూస్ ఛానల్ అధినేత పేరు కూడా తెరపైకి వచ్చింది.. మళ్లీ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం నడిచింది. అయితే కూటమి ప్రభుత్వం పాలకమండలి నియామకాన్ని ఎటూ తేల్చలేకపోయింది.


టీటీడీ ఛైర్మన్, పాలకమండలి సభ్యుల పదవుల కోసం కూటమి ప్రభుత్వంలో పోటీ పెరిగింది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీలు ప్రభుత్వంలో ఉండటంతో.. మూడు పార్టీల నుంచి ఆశావహులు కూడా ఎక్కువగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తారి ప్రచారం జరగ్గా.. ఆయన మాత్రం అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు టీటీడీ ఛైర్మన్ పోస్టు గురించి ఒకరిద్దరు తనను స్పందించారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అలాగే బీజేపీ కూడా టీటీడీ ఛైర్మన్ పదవి కోరిందనే టాక్ వినిపించింది. ఇలా టీటీడీ ఛైర్మన్ పదవితో పాటుగా పాలకమండలి సభ్యుల పదవులకు పోటీ పెరగడంతో.. టీటీడీ పాలకమండలి నియామకం ఆలస్యమవుతుందనే ప్రచారం జరుగుతోంది.


ఏపీలో కూటమి ప్రభుత్వం కావడంతో నామినేటెడ్ పదవులు ఏవైనా సరే.. మూడు పార్టీలకు న్యాయం చేయాల్సిన పరిస్థితి. మూడు పార్టీల నేతలు కలిసి ఉమ్మడి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.. ఒకటి, రెండుసార్లు సమావేశాలు నిర్వహించినా ఇప్పటి వరకు ఏకాభిప్రాయం రాలేదంటున్నారు. అందుకే టీటీడీ పాలకమండలి, మిగిలిన ప్రముఖ ఆలయాల పాకలమండళ్ల నియామకంతో పాటుగా.. వివిధ కార్పొరేషన్లు, నామినేటేడ్ పోస్టుల భర్తీపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నామినేటెడ్ పదవుల భర్తీ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందంటున్నారు. మొత్తం మీద ఈసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు టీటీడీ పాలకమండలి లేకుండానే జరుగుతాయనే వాదన వినిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com