కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇటాలియన్ పార్టీ అని ఆరోపించారు. హైదరాబాద్‌లోని రాంగోపాల్‌పేటలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నుంచి దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొత్త నాటకానికి తెరలేపారన్నారు.రాహుల్ గాంధీ మాట్లాడే మాటలను దేశద్రోహ, సంఘ విద్రోహ శక్తులు సమర్థిస్తుంటాయని, ఇలా సమర్థించడం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలని నిలదీశారు. ఉగ్రవాద సంస్థలకు, రాహుల్ గాంధీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. ఆరు గ్యారెంటీల నుంచి దృష్టి మరల్చేందుకు హైడ్రా పేరుతో నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. పేద ప్రజల పట్ల హైడ్రా వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. నాడు నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులు, ప్రభుత్వ యంత్రాంగంపై చర్యలు తీసుకోవాలన్నారు.