శ్రీకాకుళం జిల్లాలో ఈ-క్రాప్(పంట) నమోదు ప్రక్రియ సక్రమంగా సాగడం లేదు. ప్రకృతి విపత్తుల సమయంలో పంటలు దెబ్బతినే రైతులను ఆదుకునేందుకుగానూ ప్రభుత్వం ఈ-క్రాప్ నమోదు ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెల 15లోగా నమోదు పూర్తిచేయాలని లక్ష్యం విధించగా.. గడువులోగా ప్రక్రియ పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. వ్యవసాయ, రెవెన్యూశాఖల మధ్య సమన్యయ లోపం రైతులకు శాపంగా మారింది. గ్రామ రెవెన్యూ అధికారుల అలసత్వంతో కొందరు రైతులు పఽథకాలకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ పాలనలో భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో నలుగురు, ఐదుగురు రైతులకు కలిపి ఒకే ఎల్‌పీ నెంబర్(మడుల సంఖ్య) కేటాయించారు. కాగా కొన్ని గ్రామాల్లో ఎల్‌పీ నెంబరు కనిపించకపోవడంతో పంట నమోదు కావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. లాగిన్ ద్వారా సమస్య పరిష్కరించేందుకు వీలున్నా వీఆర్వోలు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇటీవల సాధారణ బదిలీలు జరగనుండడంతో తమకెందుకులే అన్న చందంగా వీఆర్వోలు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.