విజయవాడ నగరంలో పలు చోట్ల జరుగుతున్న వరద నీటి పంపింగ్ పనులను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. కండ్రిక, జర్నలిస్టు కాలనీ, రాజీవ్ నగర్‌లో వరద నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో పర్యటించారు. 64 వ డివిజన్ స్పెషల్ ఆఫీసర్ సంపత్ కుమార్‌తో కలిసి బుడమేరులో వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ., వరద నీరు బయటకు పంపింగ్ చేసేందుకు భారీ మోటార్లు ఏర్పాటు చేశామని, కొన్ని చోట్ల రోడ్లకు గండ్లు కొట్టి నీటిని బయటికి పంపించే ఏర్పాట్లు చేశామన్నారు. శుక్రవారం సాయంత్రానికి నగరంలో ఎక్కడా వరద నీరు లేకుండా పంపింగ్ చేసేలా చర్యలు చేపట్టామన్నారు. బుడ మేరు ప్రవాహానికి ఆటంకాలు లేకుండా తాత్కాలిక చర్యలు మొదలు పెట్టామని, రూరల్ ప్రాంతాల్లో ఇంకా కొన్ని చోట్ల వరద నీరు ఉందన్నారు. రెండు రోజుల్లో మొత్తం అన్ని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి తీసుకొస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.