తిరుపతి లడ్డూ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న పేరు. ఇది కేవలం ప్రసాదం మాత్రమే కాదు.. కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల నమ్మకాలతో పెనవేసుకున్న విషయం. అయితే తిరుమల లడ్డూకు ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని.. జంతువులు కొవ్వు వాడారంటూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఇన్ని రోజులు తాము పరమ పవిత్రంగా భావించిన తిరుమల శ్రీవారి లడ్డూ అపవిత్రమైందా అని తల్లడిల్లిపోయారు. ఇదే సమయంలో ఇప్పుడు ఇస్తున్న తిరుమల లడ్డూ నాణ్యమైనదేనా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియా వేదికగా ఇదే అంశంపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో తిరుపతి లడ్డూపై వస్తున్న అనుమానాలను టీటీడీ నివృత్తి చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా టీటీడీ పోస్ట్ చేసింది.
తిరుమల లడ్డూ పవిత్రతను పునరుద్ధరించామంటూ తిరుమల తిరుపతి దేవస్థానం తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. అంతే కాదు గతంలో సరఫరా అయిన నెయ్యి తాలూకు ల్యాబ్ రిపోర్టులు.. ప్రస్తుతం లడ్డూ తయారీలో వాడుతున్న నెయ్యికి సంబంధించిన ల్యాబ్ రిపోర్టులు ఈ పోస్టులో పేర్కొంది. నెయ్యి నాణ్యతను నిర్ధారించే ఎస్ వ్యాల్యూ వివరాలను అందులో పొందుపరిచింది. తిరుమల లడ్డూ పవిత్రత గురించి ఎలాంటి సందేహాలు అవసరం లేదని.. ప్రస్తుతం నాణ్యమైన నెయ్యిని వినియోగిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని టీటీడీ ఈవో ఇటీవల వెల్లడించారు. ల్యాబ్ పరీక్షల్లో ఈ విషయం తేలిందని తెలిపారు. అయితే ప్రస్తుతం కర్ణాటక నుంచి నాణ్యమైన నెయ్యిని తెప్పిస్తున్నామని ఆయన చెప్పారు.
మరోవైపు తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై సీఎం చంద్రబాబు నాయుడికి నివేదిక చేరింది. ఈ మేరకు టీటీడీ ఈవో శ్యామలరావు నివేదికను చంద్రబాబు నాయుడుకి సమర్పించారు. ఈ నివేదికపై సీఎం మంత్రులు, అధికారులతో కూడా చర్చించారు. ప్రస్తుతం సమర్పించింది ప్రాథమిక నివేదిక.. ఆదివారం మరిన్ని వివరాలను చంద్రబాబుకు టీటీడీ అధికారులు అందించనున్నారు. అలాగే ఆగమ శాస్త్ర పండితులతో జరిగిన సమావేశంలో వ్యక్తమైన సూచనలను కూడా టీటీడీ ఈవో చంద్రబాబుకు వివరించారు. దీంతో మరిన్ని విస్తృత చర్చల తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోవాలని టీటీడీకి చంద్రబాబు సూచించారు.