విశాఖపట్నంలోని యారాడ బీచ్‌లో విదేశీ పర్యాటకులకు ఘోర ప్రమాదం తప్పింది. సముద్రపు కెరటాల్లో చిక్కుకొని కొట్టుకుపోయిన నలుగురు విదేశీ టూరిస్టులను లైఫ్ గార్డ్స్ కాపాడారు. ఇటలీ నుంచి 8 మంది టూరిస్టులు విశాఖపట్నం వచ్చారు. శనివారం (సెప్టెంబర్ 21) సాయంత్రం యారాడ బీచ్‌లో సరదాగా గడిపేందుకు వచ్చారు. సముద్రపు నీటిలో దిగి కేరింతలు కొడుతుండగా.. వారిలో నలుగురు నీటిలో మునిగి కొట్టుకుపోయారు. వారి సహచరులు పెద్దగా కేకలు వేశారు. అది గమనించిన లైఫ్ గార్డ్స్ వెంటనే అప్రమత్తమయ్యారు.. కొట్టుకుపోతున్న విదేశీయులను కాపాడారు. గల్లంతైన టూరిస్టులను కాపాడిన కోస్ట్ గార్డులను ఉన్నతాధికారులు అభినందించారు. ఈ సహాయక చర్యల్లో మెరైన్ పోలీస్ అల్లు. అరునేశ్వర్రావుతో పాటు లైఫ్‌గార్డులు సీహెచ్ అప్పారావు, కె. వెంకటేష్, కె. లోవరాజు, సీహెచ్. శ్రీనివాస్ పాల్గొన్నారు.