బీహార్‌లో ఓ గాడిద చనిపోయింది. అందులో కొత్త విషయం ఏముంది అనుకుంటున్నారా. ఆ గాడిద కరెంట్ షాక్‌తో మృతి చెందింది. దీంతో గాడిద చనిపోయినందుకు దానికి పరిహారం చెల్లించాలని స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా పవర్ గ్రిడ్ స్టేషన్‌ను ముట్టడించారు. అందులో కొందరు లోపలికి చొచ్చుకెళ్లి.. విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో స్థానికులకు కరెంట్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడంతో విద్యుత్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అక్కడ నిరసన తెలుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు.
బీహార్‌లోని బక్సర్ జిల్లాలో జరిగిన ఈ చిత్రమైన సంఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంసంగా మారింది. బక్సర్ జిల్లాలోని కేసత్ బ్లాక్‌లో కరెంట్ షాక్ కారణంగా ఓ గాడిద మృత్యువాత పడింది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న వారంతా ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే స్థానికంగా నిరసన చేపట్టారు. అయితే అధికారులు స్పందించకపోవడంతో.. పక్కనే ఉన్న చకోడా పవర్ గ్రిడ్ స్టేషన్ వద్ద బైఠాయించారు. చనిపోయిన గాడిదకు కరెంట్ అధికారులు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా కొందరు స్థానికులు చకోడా పవర్ గ్రిడ్ స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లారు. అనంతరం పవర్ గ్రిడ్ నుంచి అయ్యే కరెంట్ సరఫరాను నిలిపివేశారు.
పవర్ గ్రిడ్ లోపలికి ప్రవేశించిన గ్రామస్తులు.. విద్యుత్ సరఫరా ఆపేయడంతో ఆ ప్రాంతంలో కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో స్థానికులు, కరెంట్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారనే కారణంపై గ్రామస్థులపై కేసులు పెట్టారు. దీనిపై స్పందించిన రాష్ట్ర విద్యుత్ శాఖ సీనియర్ అధికారి పోలీసులకు గ్రామస్తులపై ఫిర్యాదు చేశారు.
దాదాపు 3 గంటల పాటు స్థానికంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించినట్లు గుర్తించారు. ఇందుకు కారణం అయిన మొత్తం 65 మంది స్థానికులపై కేసు నమోదు చేసినట్లు బక్సర్ ఎస్పీ శుభం ఆర్య తెలిపారు. మరోవైపు.. ఇదే గాడిద మృతి వ్యవహారంపై విద్యుత్ శాఖ అధికారులపైనా కొందరు గ్రామస్తులు ఫిర్యాదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని శుభం ఆర్య వెల్లడించారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.