2024 ఏపీ ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ఎన్నో హామీలు ఇచ్చింది. ముఖ్యంగా సూపర్ సిక్స్ పేరిట మహిళలకు, విద్యార్థులకు, రైతులకు వరాలు ప్రకటించింది. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. ఇప్పటికే పింఛన్ల పెంపు, మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఉచిత ఇసుక వంటి పథకాలను అమలు చేసిన చంద్రబాబు నాయుడు.. దీపావళి నుంచి మరో పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకానికి దీపావళి నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ కూడా చర్చకు వస్తోంది.
ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత బస్సు ప్రయాణం హామీని త్వరలోనే అమలు చేస్తామని ప్రకటించారు. పథకం అమలుపై విధివిధానాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని కూడా తొలుత ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తారని వార్తలు వచ్చాయి. అయితే అన్నా క్యాంటీన్లను టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. ఆ తర్వాత వరదలతో ఈ పథకం అమలు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకం అమలు చేయనుండటంతో ఉచిత బస్సు ప్రయాణం పథకం కూడా త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదివారం రాయచోటి నియోజకవర్గంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉచిత గ్యాస్ సిలిండర్లను దీపావళి నుంచి అందించనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్న మంత్రి.. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. అర్హులందరికీ పారదర్శకంగా ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరేలా చేస్తామని స్పష్టం చేశారు.