ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు (మంగళవారం) ఉదయం చేరుకున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ నిర్ధారణ అయిన నేపథ్యంలో పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయన ఈరోజు దుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంకు దేవదాయ శాఖ కమిషనర్, ఈవో స్వాగతం పలికారు.
అనంతరం అమ్మవారి ఆలయ మెట్టను శుద్ధిచేసే కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. అనంతరం మెట్ల పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశినేని శివనాథ్ చిన్ని, బాలశౌరి, ఎమ్మెల్సీ హరిప్రసాద్ పాల్గొన్నారు. మరోవైపు అక్టోబర్ 1న పవన్ తిరుమలకు వెళ్లనున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ఘటన నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఆయన దీక్ష విరమణ కోసం తిరుమలకు వెళ్లాలని నిర్ణయించారు. మెట్ల మార్గాన ఆయన తిరుమలకు వెళ్లనున్నారు. అక్టోబర్ 1న అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. 2న శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు. ఇక 3న తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు.