తిరుపతి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ జరిగిందంటూ గత కొన్ని రోజులుగా తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. తాజాగా ఈ అంశంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సహజంగానే ధర తగ్గినప్పుడు నాణ్యత కూడా తగ్గుతుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల కొండపై అంతులేని అవినీతి జరిగిందని ఆరోపించారు. దొడ్డిదారిన ఈవో పోస్టులు ఇచ్చి, భక్తుల విశ్వాసాలకు విఘాతం కలిగే చర్యలకు అవకాశం ఇచ్చారని విమర్శించారు. దోపిడీదారులకు పాలకమండలి పదవులు కట్టబెట్టారని నారాయణ మండిపడ్డారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే రివర్స్ టెండర్లు అనే కొత్త పాలసీ తీసుకువచ్చాడు. ఆ పాలసీ పూర్తిగా విఫలం కావడమే కాదు, నష్టదాయకంగా మారింది. పోలవరంలో ఏం జరిగిందో చూశాం. రివర్స్ టెండరింగ్ అన్నాడు, కాంట్రాక్టర్లను మార్చాడు... మరి ఎంత మిగిల్చాడు? తిరుపతిలోనూ లడ్డూల నెయ్యి విషయంలో రివర్స్ టెండరింగ్ పెట్టాడు. పాత పద్ధతి తీసేసి కొత్త పద్ధతి పెట్టాడు. అప్పుడు నెయ్యి రూ.500 ఉంటే, దాన్ని రూ.320కి వచ్చేలా చేశాడు. ఎప్పుడైనా నాణ్యత తగ్గితే, రేటు కూడా తక్కువగానే ఉంటుంది. నాణ్యత పెరిగితే రేట్లు పెరుగుతాయి. నెయ్యి విషయంలోనూ అదే జరిగింది. ధర తగ్గడం వల్ల కల్తీకి అవకాశం ఏర్పడింది. ఈ విషయం కాస్తా ల్యాబరేటరీకి వెళ్లింది... ల్యాబరేటరీ వాళ్లు అది ఆవు నెయ్యి కాదని, కల్తీ నెయ్యి అని చెప్పేశారు" అని వివరించారు.