తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం, ఇతర ప్రసాదాల తయారీ కోసం ఉత్తరాంధ్ర నుంచి జీడిపప్పు సరఫరా అవుతున్నాయి. టీటీడీకి తొలిసారిగా శ్రీకాకుళం జిల్లా పలాస జీడిపప్పును పంపించారు.. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీషలు జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించారు. కాశీబుగ్గ పారిశ్రామికవాడలోని ఎస్‌ఎస్‌ఎస్ ఇంటర్నేషనల్ ఆగ్రో ఉత్పత్తుల సంస్థకు.. టీటీడీకి జీడిపప్పు సరఫరా చేసేందుకు ఇటీవల టెండర్ ఖరారైంది. ఈ మేరకు 10 టన్నుల జీడిపప్పును తిరుమలకు పంపించారు.
తిరుమల శ్రీవారి ప్రసాదంలో ఉపయోగించేందుకు పలాస నుంచి జేహెచ్ (బద్ద) రకం జీడిపప్పును పంపించారు. లారీని పూలదండలతో అలంకరించి.. దానికి గరుడ వాహనంగా నామకరణం చేశారు. ముందుగా వేంకటేశ్వరస్వామి చిత్రపటానికి పూజలు చేసిన అనంతరం లారీని పంపించారు. జీడి కార్మికులు, వ్యాపారులు పెద్ద ఎత్తున పాల్గొని లారీని గోవిందనామ స్మరణతో సాగనంపారు. పలాస జీడిపప్పును తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించడం శుభపరిణామం అన్నారు నేతలు. అలాగే రాబోయే రోజుల్లో పలాస ఖ్యాతి ప్రపంచ వ్యాప్తం కావాలని ఆకాంక్షించారు. వెంకటేశ్వరస్వామి తనకు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నామని.. జీడిపప్పును సరఫరా చేస్తున్న ఎస్‌ఎస్‌ఎస్ ఇంటర్నేషనల్ ఆగ్రోస్ సంస్థ చైర్మన్ కోరాడ సంతోష్‌కుమార్. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడకుండా మేలురకం పంపిస్తామని తెలిపారు. భక్తిశ్రద్ధలతో జీడిపప్పు తయారు చేశామన్నారు.
'తిరుమల తిరుపతి దేవస్థానంలో నాణ్యమైన, రుచికరమైన లడ్డూ తయారీకి అనుగుణంగా.. పలాస ప్రాంతం నుంచి సరఫరా చేయనున్న జీడిపప్పు వాహనాలను జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. మన ప్రాంతం జీడిపప్పు తిరుమల ప్రసాదంలో వాడడంపై మన ప్రాంత వాసిగా ఎంతో గర్వపడుతున్నాను' అంటూ కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంతో.. టీటీడీ కర్ణాటక నందిని నెయ్యిని ఉపయోగిస్తోంది. ఈ మేరకు కర్ణాటక నుంచి నెయ్యి ట్యాంకర్లు తిరుమలకు వస్తున్నాయి.. అయితే తాజాగా టీటీడీకి పలాస నుంచి జీడిపప్పు కూడా పంపిస్తున్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని టీటీడీ చెబుతోంది.