అతి తీవ్రమైన హరికేన్ హెలెనా ఆగ్నేయ అమెరికాలో విధ్వసం సృష్టిస్తోంది. తుపాను కారణంగా కనీసం 44 మంది మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.దాదాపు 15- 26 బిలియన్ డాలర్లు ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో కేటగిరి- 4 హరికేన్ ప్రభావం అధికంగా ఉందన్నారు.హెలెనా తుపాను కారణంగా దాదాపు 44 మంది మృతి చెందగా.. అందులో ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది, ఒక మహిళ, నెల వయసున్న చిన్నారి సైతం ఉన్నట్లు వెల్లడించారు. జార్జియాలోని పలు ఆసుపత్రుల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. యునికోయ్ కౌంటీ ఆసుపత్రిని వరదలు ముంచెత్తడంతో హెలికాఫ్టర్ సహాయంతో 54 మందిని రక్షించినట్లు వెల్లడించారు. అదేవిధంగా టెనస్సీలోని న్యూపోర్ట్ సమీపంలో 7 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు.
ఫ్లోరిడాలో తుపాను తీరం దాటేటప్పుడు గంటకు 225 కి.మీ. వేగంతో గాలులు వీచినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక, అట్లాంటాలో 48 గంటల్లో 28.24 సెం.మీ.ల వర్షపాతం నమోదవగా.. 1886లో నమోదైన 24.36 సెం.మీ. రికార్డును బద్దలు కొట్టినట్లు తెలిపారు. తుపాను కారణంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకు సెలవు ప్రకటించగా.. విమాన సర్వీసులను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.ఇదిలాఉండగా.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. అందరూ సురక్షితంగా ఉండాలని తాను ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.