కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై కేసు నమోదైంది. ఎన్నికల బాండ్ల పేరిట పలువురు పారిశ్రామికవేత్తలను బెదిరించారన్న ఆరోపణల నేపథ్యంలో బెంగళూరు తిలక్‌నగర ఠాణా పోలీసు స్టేషన్‌లో నిర్మలమ్మపై కేసు నమోదైంది.ఎన్నికల బాండ్ల పేరిట పలువురు పారిశ్రామిక వేత్తలను నిర్మలా సీతారామన్ బెదిరించి బీజేపీకి నిధులు వచ్చేలా చేశారని జనాధికార సంఘర్ష పరిషత్తు కు చెందిన ఆదర్శ్ అయ్యర్ ఆరోపిస్తున్నారు. ఈ విషయమై గతంలో తిలక్ నగర ఠాణాలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే, పోలీసులు అతడి ఫిర్యాదును స్వీకరించలేదు. దీంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం.. కేంద్ర మంత్రిపై కేసు నమోదు చేయాలని తిలక్‌నగర ఠాణా పోలీసులను శుక్రవారం ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 10కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు తిలక్‌నగర ఠాణా పోలీసులు తాజాగా కేంద్ర మంత్రిపై కేసు నమోదు చేశారు. నిర్మలా సీతారామన్‌తోపాటు మరికొందరిపై కూడా ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు.