గత ప్రభుత్వ విధానాలతో అస్తవ్యస్తంగా మారిన విద్యావ్యవస్థను గాడిన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలు, నిర్ణయాలు హర్షణీయమని ఎస్టీటీఎఫ్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు నాగరాజు అన్నారు. ఆదివారం నంద్యాలలోని స్థానిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో నాగరాజు మాట్లాడుతూ జీవో 117ను రద్దుచేసి 3, 4, 5 తరగతులను ప్రాథమిక పాఠశాలలో కలపాలన్న కూటమి నిర్ణయం అభినందనీయమన్నారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన 117తో విద్యావ్యవస్థ అతలాకుతలమైందన్నారు. ఎనడీఏ ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ఉత్తర్వులను రద్దు చేయాలని, పాఠశాల విద్యాశాఖ నిర్ణయించిందని వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ రద్దు అమల్లోకి వచ్చేలా కసరత్తు చేస్తోందన్నారు. పాఠశాల విద్యావ్యవస్థలో విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల ఆర్థిక అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్టీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు రాము, సభ్యులు రామకృష్ణ, చంద్రమోహన, రవీంద్రబాబు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.