ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో మైనర్ బాలికపై అత్యాచారం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఆటోలో ఎక్కించుకుని శివారు ప్రాంతానికి తీసుకెళ్లి.. బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. తిరిగి ఆటో ఎక్కిస్తున్న సమయంలో స్థానికులు గుర్తించడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఇదే సమయంలో దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని సైతం స్థానికులు బంధించి పోలీసులకు అప్పగించారు. అయితే ఈ వ్యవహారంపై వైసీపీ టీడీపీ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తోంది. నిందితుడు జానీ తెలుగుదేశం పార్టీకి చెందినవాడేనని ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల పిఠాపురం మైనర్ బాలిక ఘటనపై స్పందించారు. పిఠాపురంలో జానీలు రెచ్చిపోతున్నారంటూ యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజురోజుకూ అఘాయిత్యాలు పెరుగుతున్నాయని యాంకర్ శ్యామల ఆరోపించారు. ఓ మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని అభిప్రాయపడ్డారు. పుంగనూరు బాలిక కేసులో పోలీసులు సరిగా స్పందించలేదన్న యాంకర్ శ్యామల.. సకాలంలో స్పందించి ఉంటే ఆ పాప బతికేదన్నారు. గుడ్లవల్లేరు కాలేజీలో రహస్య కెమెరాలు పెట్టారని అమ్మాయిలు వాపోతే పట్టించుకోలేదని.. సెలవులు ఇచ్చి అందర్నీ పంపేశారని విమర్శించారు. వైఎస్ జగన్ పాలనలో ఆడపిల్లలు, మహిళలకు రక్షణ ఉండేదన్న యాంకర్ శ్యామల.. టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదన్నారు.
వైసీపీ తనను అధికార ప్రతినిధిగా ఎంపిక చేసిన తర్వాత.. తనపైనా దారుణంగా పోస్టులు పెడుతూ, ట్రోల్ చేస్తున్నారని యాంకర్ శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి రావటం తప్పా అని ప్రశ్నించిన శ్యామల.. ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్‌లోకి వస్తే ఎందుకంత చులకన ఆంటూ నిలదీశారు. " సినిమాల్లో పనిచేసిన వాళ్లు రాజకీయాల్లోకి రాకూడదా? టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ గారు నటుడేగా.. ప్రజారాజ్యాన్ని స్థాపించిన చిరంజీవి నటుడేగా.. ఇప్పటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నటుడేగా.. అబ్బాయిలు వస్తే పర్లేదు.. అమ్మాయిలు, మహిళలు రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఇష్టానుసారం ట్రోలింగ్ చేస్తారా? ఇదెంత వరకూ కరెక్ట్.. బాలకృష్ణ గారూ నటుడేగా, ఆయన తనయుడు మోక్షజ్ఞ కూడా సినిమాల్లోకి వస్తున్నారుగా. మోక్షజ్జ సినిమాల్లో ఆయన పక్కన హీరోయిన్‌ను పెడతారో, పెట్టరో.. మీ పార్టీలోనూ గతంలో సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన మహిళలు పనిచేశారుగా. ప్రత్యర్థి పార్టీలోని మహిళల గురించి ఇలా ట్రోలింగ్ చేయడం ఎంత వరకూ కరెక్ట్ అంటూ యాంకర్ శ్యామల ప్రశ్నించారు.
అయితే తనపై ఎంత ట్రోలింగ్ చేసినా వెనక్కి తగ్గేది లేదని యాంకర్ శ్యామల చెప్తున్నారు. " ఇబ్బంది పెడితే భయపడి వెళ్లిపోతారులే అనుకుంటున్నారేమో.. మీరు మమ్మల్ని ఎంత మానసికంగా దెబ్బతీయాలనుకున్నా వెనక్కి తగ్గం. చేతనైనంతా చేశారు. ఇండస్ట్రీలో పని లేకుండా చేశారు. పర్వాలేదు. నిలబడి తట్టుకునేంత శక్తి నాకుంది. అడ్డుకునే ధైర్యం నాకుంది. మా పార్టీలోని మహిళా నేతలపై మీరెంత అసభ్యకరంగా మాట్లాడినా, ఎంత కృంగదీయాలని చూసినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలపై కఠిన చర్యలు తీసుకోవాలి. " యాంకర్ శ్యామల అని డిమాండ్ చేశారు.